వికారాబాద్ జిల్లాలో ఉన్న దామగుండం రిజర్వ్ ఫారెస్ట్‌కు ఏళ్ల చరిత్ర ఉంది. అనంతగిరి రిజర్వ్ ఫారెస్ట్‌కు ఆనుకుని ఉన్న దామగుండం అడవిలో కొన్ని వేల రకాల మొక్కలు ఉన్నాయి. ఆ రిజర్వ్ ఫారెస్ట్‌కు ఎవరైనా వచ్చి ఆ గాలిని పీలిస్తే ఉన్న రోగాలు పూర్తిగా నయమవుతాయని స్థానికులు అంటుంటారు. దామగుండం వెళ్తే యమగండం పోతుందని ఓ నానుడి కూడా ఉంది. అంతటి చరిత్ర గల దామగుండం ఫారెస్ట్‌పై గత కొన్ని రోజులుగా వివాదం నడుస్తోంది. దామగుండం ఫారెస్ట్‌లో తూర్పు నౌకాదళ రాడార్ స్టేషన్ నెలకొల్పేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాదాపు 3 వేల ఎకరాల అటవీ భూమిలో ఈ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ స్టేషన్ ఏర్పాటుకు ఫారెస్ట్‌లోని 12 లక్షల మెుక్కలు నరికివేయనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
దామగుండం ప్రాంతంలోని అటవీ సంపద, వన్యప్రాణులకు ముప్పు పొంచి ఉందని స్థానికుల నుంచి ఆందోళన వ్యక్తం అవుతోంది. రాడార్ కేంద్రం ఏర్పాటు ద్వారా ఔషధ మొక్కలకు ప్రమాదం ఉందని, పర్యావరణానికి తీవ్ర హాని జరుగుతుందని అంటున్నారు. వికారాబాద్ అడవుల్లో సహజ వనరులను కోల్పోతామని, వన్యప్రాణుల మనుగడకు కూడా ముప్పు కలుగుతుందని పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు, పర్యావరణ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.