గుంటూరు జిల్లా తెనాలికి చెందిన పానీపురం బండి నిర్వహించే వ్యక్తికి అరుదైన గౌరవం దక్కింది. ఏకంగా రాష్ట్రపతి ప్రత్యేకంగా ఆహ్వాన పత్రికను పంపించారు. ఆగస్టు 15న ఢిల్లీలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనే అవకాశం దక్కింది. తెనాలి బాలాజీరావుపేటకు చెందిన మెఘావత్ చిరంజీవి.. రైల్వే స్టేషన్ వీధిలో పానీ పూరి అమ్ముతున్నారు. ఆయనకు ఆర్థికంగా ఇబ్బందులు రావడంతో వడ్డీ వ్యాపారుల దగ్గర డబ్బులు తీసుకునేవారు. ఆ తర్వాత ఆయన తన ఆలోచనను మార్చుకున్నారు.
జాతీయ పట్టణ జీవనోపాధి మిషన్ కింద మెప్మా రుణం తీసుకున్నారు. 2021లో రూ.10 వేలు, 2022లో రూ.20 వేలు, 2023లో రూ.50 వేలు చొప్పున రుణం తీసుకున్నారు. అంతేకాదు ఆ రుణాన్ని సకాలంలో చెల్లించారు. తెనాలి చిరంజీవికి మెప్మాలో మంచి పేరొచ్చింది. తీసుకున్న రుణాన్ని సమయానికి చెల్లిస్తున్నారనే ప్రశంసలు అందుకున్నారు.. అంతేకాదు చిరంజీవిని బ్యాంకు అధికారులు కూడా ప్రశంసించారు. చిరంజీవి తన పానీ పూరి వ్యాపారం నిర్వహించే బండి దగ్గర డిజిటల్ పేమెంట్స్‌ను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చారు. చిన్న బండి దగ్గర డిజిటల్ పేమేంట్స్ తీసుకునే విధంగా బ్యాంక్ అధికారులు ప్రోత్సహించారు.
ఇంతలో చిరంజీవికి తెనాలి పోస్ట్ ఆఫీస్ సిబ్బంది ఓ లెటర్ తీసుకెళ్లి ఇచ్చారు. ఢిల్లీలో రాష్ట్రపతి నుంచి ప్రత్యేక ఆహ్వానం వచ్చిందని తెలిపారు. అదేంటి తనకు రాష్ట్రపతి ఆహ్వానం పంపించడం అని అవాక్కయ్యారు.. ఢిల్లీలో ఆగస్టు 15న జరిగే స్వాత్రంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలని ఆహ్వానంలో పేర్కొన్నారు. తనకు రాష్ట్రపతి నుంచి ఆహ్వానం రావడం ఏంటా అని ఆరా తీస్తే.. మెప్మాలో రుణాలు తీసుకొని వాటిని సకాలంలో చెల్లించడంతో పాటుగా పానీ పూరి వ్యాపారంలో డిజిటల్ పేమెంట్స్‌ను ప్రోత్సహిస్తున్న చిరంజీవిని గుర్తించి రాష్ట్రపతి ఈ ప్రత్యేక ఆహ్వానం పంపినట్లు తెలుసుకున్నారు.
రాష్ట్రపతి నుంచి ప్రత్యేక ఆహ్వానం రావడంతో చిరంజీవి ఆనందంలో ఉన్నారు. ఢిల్లీ వెళ్లి కచ్చితంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొంటానని చెప్పారు. స్వయంగా రాష్ట్రపతి నుంచి ఆహ్వానం అందడంపై ఆయన కుటుంబం, స్థానికులుు హర్షం వ్యక్తం చేశారు. ఓ సాధారణ పానీ పూరీ వ్యపారికి రాష్ట్రపతి ఆహ్వానం పంపించడం చర్చనీయాంశమైంది.