తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్యమైన గమనిక.. కొండపై రద్దీ పెరగడంతో దర్శనం విషయంలో టీటీడీ కీలక ప్రకటన చేసింది. టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలరావు, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి తిరుమలలోని సీఆర్వో జనరల్, నారాయణగిరి షెడ్లు, క్యూ లైన్‌లను తనిఖీ చేశారు. గత మూడు రోజులుగా వరుస సెలవులు, పురటాసి మాసం రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరగడంతో పాటు, ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేని భక్తులకు దాదాపు 20 నుండి 24 గంటల సమయం శ్రీవారి దర్శనానికి పడుతోందన్నారు. కావున దర్శనం కోసం భక్తులు తమ వంతు వచ్చే వరకు ఓపికతో వేచి ఉండాలన్నారు.
వైకుంఠం కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి షెడ్లు, బయట క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు అన్నప్రసాదం, తాగునీరు, పాలు, టీ, కాఫీలను టీటీడీ యాజమాన్యం నిరంతరాయంగా అందించేందుకు విస్తృత ఏర్పాట్లు చేసిందని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ఈ ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించేందుకు సీనియర్ అధికారులను కూడా టీటీడీ నియమించిందన్నారు. అంతకుముందు నారాయణగిరి షెడ్లు, బయట క్యూ లైన్ల వద్ద అన్నప్రసాదాలు, పాలు, తాగునీరు పంపిణీని పరిశీలించారు. సి ఆర్ వో వెనుక భాగాన యాత్రికులు వేచి ఉండేలా ఒక వెయిటింగ్ హాల్ ను ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత, ఆయన సిఆర్ఓ వద్ద ఉన్న యాత్రికుల సమాచార కౌంటర్‌ను పరిశీలించారు. యాత్రికులకు వసతి మరియు ఇతర సౌకర్యాలపై మెరుగైన సమాచారం ఎలా తెలియజేయాలనే దానిపై సంబంధిత సిబ్బందికి కొన్ని సూచనలు చేశారు.
Amaravati News Navyandhra First Digital News Portal