కూరగాయలు కొందామంటేనే సామాన్యులు వణికిపోతున్నారు. కూరగాయల ధరలు వింటేనే గుండెల్లో దడ పుడుతుందంటున్నారు జనాలు. ఆ రేంజ్‌లో కూరగాయల ధరలు పెరిగిపోయాయి. అందులోనూ.. టమాట ధరలు మండిపోతున్నాయి. నెల కిందటి వరకు టమాటా ధరలు 30 నుంచి 40 రూపాయలు (కిలోకు) ఉండగా.. ఈ 15 రోజుల గ్యాప్‌లోనే కొండెక్కి కూర్చున్నాయి. ఈ రెండు వారాల్లోనే ఉన్నట్టుండి టమాట రేట్లు ఏకంగా ట్రిపుల్ అయ్యాయి. ప్రస్తుతం టమాటా ధర.. 100 నుంచి 120 రూపాయలు పలుకుతోంది. హోల్ సేల్ మార్కెట్‌లోనే కిలో టమాటా ధర 80 రూపాయలు పలుకుతుండగా.. అవి రిటైల్ మార్కెట్‌కు వచ్చేసరికి దాని ధర.. 100 నుంచి 120 అవుతోందని కూరగాయల వ్యాపారులు చెప్తున్నారు.
అయితే.. టమాటా ధరలు ఒక్కసారిగా ఇంతగా ఎందుకు పెరిగిపోయాయని సాధారణ ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. అయితే.. డిమాండ్‌కు సరిపడా టమాటా రాకపోవడమే ధరల పెరుగుదలకు అసలు కారణమని వ్యాపారులు చెప్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో టమాటా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని.. దీంతో సరఫరా తగ్గిపోవటంతో.. మార్కెట్‌లో డిమాండ్ పెరిగిపోయిందని చెప్తున్నారు.
మరోవైపు.. హైదరాబాద్‌కు తెలంగాణలోని జిల్లాల నుంచి కాకుండా ఏపీలోని రాయలసీమతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి టమాటా దిగుబడి అవుతుంది. అయితే.. మొన్నటి వరకు కురిసి భారీ వర్షాలతో ఇతర రాష్ట్రాల్లో దిగుబడి తగ్గిపోయింది. ఫలితంగా.. ధరలు అమాంతం పెరిగినట్టు చెప్తున్నారు. సాధారణంగా అయితే.. ఎండా కాలంలో టమాటా ధరలు ఎక్కువగా ఉంటాయి. కానీ.. ప్రస్తుతం ఎండకాలంలో కంటే కాస్త ఎక్కువగానే టమాటా మండిపోతుండటం గమనార్హం.
ఇదిలా ఉంటే.. మార్కెట్‌లో డిమాండ్‌కు సరిపడా సరుకు లేకపోవటంతో.. ఈ పరిస్థితిని కొందరు దళారులు సొమ్ము చేసుకుంటూ.. రేట్లు భారీగా పెంచుతున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. పండించిన రైతులకు సాధారణ ధరలే చెల్లించి.. మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌ను దళారులు క్యాష్ చేసుకోవటం కూడా ఇప్పుడు టమాటా రేట్లు ట్రిపుల్ అయ్యేందుకు ఓ కారణమని ఆరోపిస్తున్నారు కొందరు కూరగాయల వ్యాపారులు.