కార్తీక మాసం పుణ్యమాని కూరగాయల ధరలు మళ్లీ కొండెక్కి కూర్చున్నాయి. మాంసాహారినిక సరిసమానంగా కూరగాయల ధరలు పలుకుతున్నాయి. దీంతో సామాన్యులు కొనలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు..
కార్తీక మాసం మరికొన్ని రోజుల్లో ముగియనుంది. అయినా బహిరంగ మార్కెట్లలో కూరగాయల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. సాధారణంగా కార్తీక మాసంలో మాంసాహారానికి చాలా మంది దూరంగా ఉంటారు. దీంతో ఈ నెల మొత్తం శాఖాహారమే తీసుకుంటారు. దీంతో ప్రతీయేట ఈ మాసంలో చికెన్, మటన్ ధరలు తగ్గుతుంటాయి. ఇక ఈసారి కూడా చికెన్ ధర రూ.180కి చేరింది. అయితే కూరగాయల ధరలు మాత్రం అనూహ్యంగా పెరిగాయి. ఏకంగా మాంసాహారానికి చేరువలో కాయగూరలు, ఆకుకూరల రేట్లు తిష్టవేశాయి. స్థానికంగా ఉద్యాన పంటలు సాగవుతున్నా ధరలు మాత్రం మండిపోతున్నాయి. అధిక ధరల కారణంగా సామాన్యులు విలవిల్లాడుతున్నారు. ఇంతటి ధరలు మునుపెన్నడూ చూడలేదంటూ పెదవివిరుస్తున్నారు.
కార్తీక మాసంలో ఎక్కువ శాతం మంది భక్తులు వివిధ దేవుళ్ల మాలలు ధరించడం, వారు పూర్తిగా శాఖాహారానికే పరిమితం కావడం, వారి కుటుంబాలు కూడా దాదాపు 30 నుంచి 40 రోజులపాటు శాఖాహారమే తీసుకోవడం కారణంగా వ్యాపారులు కూరగాయల ధరలు అమాంతం పెంచేశారు. ముఖ్యంగా భద్రాద్రి జిల్లాలో కూరగాయల ధరలు అమాంతంగా పెరిగాయి. ఇక్కడ నీటి వనరులున్న అధికంగా ఉండటంతో కూరగాయలు, ఆకుకూరల సాగు గణనీయంగా జరుగుతోంది. అయినా ప్రజల వినియోగానికి ఇవి సరిపోవడం లేదు. దీంతో ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. మరోవైపు ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల పంట దిగుబడి తగ్గిందని, అందువల్లనే ధరలు ఒక్కసారిగా పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. అయితే కొందరు వ్యాపారులు మాత్రం లాభాల కోసం డిమాండ్‌ను బట్టి ధరలను పెంచుతున్నారు.
ముఖ్యంగా కేజీ చిక్కుడు కాయల ధర రూ.100కుపైగా పలుకుతోంది. కేజీ టమాటా రూ.50 నుంచి రూ.70 వరకు విక్రయిస్తున్నారు. రూ.10కి విక్రయించే చిన్న సొరకాయ ఏకంగా రూ.50కి చేరింది. ఇక ఆకుకూరల ధరలైతే చుక్కలకు చేరాయి. రూ.20కి చిన్నవి మూడు కట్టలు మాత్రమే ఇస్తున్నారు. 3 నిమ్మకాలు రూ.20, ఉల్లి కేజీ రూ.60.. ఇలా అన్ని కూరగాయల ధరలు పెరిగిపోయాయి. కూరగాయల ధరలు ఇంతలా పెరగడం ఎప్పుడూ చూడలేదని వినియోగదారులు వాపోతున్నారు. ఈ ధరలు చూస్తే కొనే పరిస్థితి, తినే పరిస్థితి కన్పించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఒక్క భద్రాద్రి జిల్లాలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల కూరగాయల ధరలు ఇదే మాదిరి ఉన్నాయి.