సోషల్‌మీడియాలో పాపులారిటీ .. యూట్యూబ్ హిట్స్ కోసం ఏం చేసేందుకైనా వెనకాడటం లేదు కొందరు. అర్ధంపర్ధం లేని వీడియోలు చేస్తూ కొందరు ప్రమాదాల్లో పడుతుంటే.. మరికొందరు న్యాయపరమైన చిక్కుల్లో పడుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి జాతీయపక్షి నెమలి కర్రీ రెసిపీ పేరుతో వీడియో చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాడు.
నెమలి కూర వండి వీడియో అప్‌లోడ్ చేసిన యూట్యూబర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లికి చెందిన ప్రణయ్ కుమార్ అనే వ్యక్తి గత కొంతకాలంగా యూట్యూబ్‌లో వీడియోలు చేస్తున్నాడు. తాజాగా నెమలి కూర సంప్రదాయ పద్ధతిలో ఎలా వండాలి అనే వీడియో అప్‌లోడ్ చేశాడు. అది క్రైమ్ అంటూ.. నెటిజన్ల నుంచి కామెంట్స్ రావడంతో.. భయపడి వెంటనే యూట్యూబ్ నుంచి వీడియోను డిలీట్ చేశాడు. నెమలి జాతీయ పక్షి కావడంతో అటవీశాఖ అధికారులు అతడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. అడవిలో ప్రణయ్ కూర వండిన ప్రదేశాన్ని పరిశీలించి, విచారణ చేపట్టారు.
అయితే వ్యూస్ కోసం నెమలి కూర అంటూ యూట్యూబ్ అప్లోడ్ చేశానని.. అది కోడి కూర అని ప్రణయ్ కుమార్ అంటున్నాడు. అయితే నెమలి కూర అని పెట్టుకోవడం నేరం.. అయినా స్వాధీనం చేసుకున్న కూరను ల్యాబ్ టెస్ట్‌కు పంపించి… నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామన్నారు అధికారులు.