తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాదిమంది భక్తులు ఎక్కడికెక్కడి నుంచో తరలివస్తుంటారు. సుదూరం నుంచి వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి.. ఆ దేవదేవుడి దర్శనం కోసం వస్తుంటారు. అలా వచ్చే వారి కోసం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ఉంటుంది. యాత్రికుల వసతి, భోజనం, దర్శనం విషయాల్లో ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా టీటీడీ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ వస్తోంది. శ్రీవారి దర్శనానికి రోజురోజుకూ యాత్రికుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో.. తిరుమల శ్రీవారి భక్తుల వసతి కోసం నూతన సముదాయాన్ని టీటీడీ నిర్మిస్తోంది. ఈ పనులను ఈ ఏడాది ఆఖరి నాటికి పూర్తిచేసి.. జనవరి కల్లా ప్రారంభించాలని టీటీడీ భావిస్తోంది.
ఈ క్రమంలోనే తిరుమలలో నూతనంగా నిర్మిస్తున్న యాత్రికుల వసతి సముదాయం-5 భవనాన్ని శుక్రవారం సాయంత్రం టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తనిఖీ చేశారు. భవనంలో ఏర్పాటు చేస్తున్న కల్యాణ కట్ట, హాళ్లు, భోజనశాల, మరుగుదొడ్లు, విద్యుత్ వైరింగ్ పనులను పరిశీలించారు. పలు సూచనలు చేశారు. మరోవైపు ఈ ఏడాది ఆఖరిలోపు నిర్మాణ పనులను పూర్తి చేయాలని టీటీడీ భావిస్తోంది. 2025 జనవరి నెల లోపు భవనాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు. పనుల్లో వేగం పెంచాలని.. ఆలస్యం జరగకుండా చూడాలని స్పష్టం చేశారు.
Amaravati News Navyandhra First Digital News Portal