శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ రోజు కళ్యాణోత్సవం రద్దు

తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే కళ్యాణోత్సవాన్ని ఆగస్ట్ 18న తేదీ తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. పవిత్రోత్సవాల నేపథ్యంలో ఆగస్ట్ 18న నిర్వహించే కళ్యాణోత్సవాన్ని రద్దుచేసినట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలియజేసింది. శ్రీవారి ఆలయంలో ఆగస్టు 15 నుంచి 17వ తేదీ వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆలయంలోని సంపంగి ప్రాకారంలో వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దీంతో ఆగస్ట్ 18న కళ్యాణోత్సవాన్ని రద్దుచేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని సూచించింది.

మరోవైపు ఆగస్ట్ 15 నుంచి 17వ తేదీ వరకూ మూడు రోజుల పాటు తిరుమలలో పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఆగస్ట్ 14న అంకురార్పణతో పవిత్రోత్సవాలు మొదలవుతాయి. ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు శ్రీవారి ఆల‌యంలోని సంపంగి ప్రాకారంలో ఉదయం వేళ స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం శ్రీదేవీ భూదేవీ సమేత మలయప్పస్వామి ఆల‌య మాఢ వీధుల్లో విహ‌రిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. ఆగ‌స్టు 15న పవిత్రాల ప్రతిష్ఠ, 16న పవిత్ర సమర్పణ, 17న పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాల అంకురార్పణ సందర్భంగా ఆగస్ట్ 14న సహస్రదీపాలంకార సేవను రద్దు చేశారు. అలాగే ఆగస్ట్ 15న తిరుప్పావడను రద్దు చేశారు. ఆగస్ట్ 15 నుంచి 17వ తేదీ వరకూ కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజలసేవ, సహస్రదీపాలంకార సేవలను సైతం టీటీడీ రద్దు చేసింది.

శ్రీవారి సేవలో ఆంధ్రప్రదేశ్ మంత్రులు

మరోవైపు తిరుమల శ్రీవారిని సోమవారం పలువురు ఏపీ మంత్రులు దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కుటంబసభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. అలాగే తెలంగాణ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు.

About amaravatinews

Check Also

తిరుమల రూపురేఖలు మారబోతున్నాయి.. త్వరలోనే, టీటీడీ ఈవో కీలక వ్యాఖ్యలు

తిరుమలను పక్కా ప్రణాళికతో కూడిన మోడల్‌ టౌన్‌గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు టీటీడీ ఈవో జే శ్యామలరావు. తిరుపతిలోని పరిపాలన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *