తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక. తిరుమల, తిరుపతికి భారీ వర్ష సూచన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా గురువారం శ్రీవారి మెట్టు నడక మార్గాన్ని మూసివేయాలని నిర్ణయించింది. భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికలతో టీటీడీ ఈవో శ్యామలరావు.. బుధవారం ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విపత్తును ఎలా ఎదుర్కొనాలనే దానిపై పలు సూచనలు చేశారు. టీటీడీ సిబ్బంది మొత్తం అప్రమత్తంగా ఉండాలన్న ఈవో.. భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రేపు (అక్టోబర్ 17) శ్రీవారి మెట్టు నడక మార్గం మూసివేయాలని ఆదేశించారు. వాతావరణ పరిస్థితులను అనుసరించి ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని.. ఈ నేపథ్యంలో ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు.
ఘాట్ రోడ్లలో కొండచరియలు విరిగిపడితే వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో ఆదేశించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని.. జనరేటర్లు నడపడం కోసం డీజిల్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. భక్తుల దర్శనాలు, వసతి, ప్రసాదం వంటి కార్యక్రమాల్లో అంతరాయం కలగకుండా ఐటీ వింగ్ ముందుజాగ్రత్తలు తీసుకోవాలని టీటీడీ ఈవో ఆదేశించారు. అంబులెన్సులను సిద్ధం చేసుకోవాలని.. ఇంజనీరింగ్ అధికారులు తిరుమలలోని డ్యామ్ గేట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. అనుకోని పరిస్థితులు తలెత్తితే వెంటనే స్పందించేలా అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
Amaravati News Navyandhra First Digital News Portal