తిరుమల శ్రీవారి దర్శనానికి నిత్యం వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. ఇలా తిరుమలకు వచ్చే భక్తులకు సరసమైన ధరలకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన ఆహారాన్ని అందించడమే టీటీడీ లక్ష్యమన్నారు ఈవో జే శ్యామలరావు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఫుడ్ సేఫ్టీ విభాగంవారు అన్నప్రసాదం సిబ్బందికి, పెద్ద, జనతా క్యాంటీన్‌ల నిర్వాహకులకు త్వరలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే ప్రతి హోటల్ లో ధరల పట్టికను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, ప్రమాణాలను మెరుగుపరుచుకునేందుకు ఆగస్టు 5వ తేదీ వరకు సమయం ఇస్తున్నట్లు ఆయన తెలియజేశారు.
తిరుమల గోకులం విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో టీటీడీ ఈవో, ఫుడ్ సేఫ్టీ శాఖ అధికారులతో తిరుమలలోని పెద్ద, జనతా క్యాంటీన్‌లపై సమావేశం నిర్వహించారు. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు, ఫుడ్ సేఫ్టీ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌పై సవివరంగా పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్‌ను అందించారు. ఇందులో తిరుమలలోని అన్ని రెస్టారెంట్లు, తినుబండారాల తయారీదారులు అనుసరించాల్సిన పరిశుభ్రత, పారిశుద్ధ్య పద్ధతులు తెలిపారు.
ఆహారం చెడిపోవడం వల్ల కలిగే భౌతిక-రసాయన-జీవ ప్రమాదాలు, ముడి సరుకులు నిల్వ చేసే పద్ధతులు, వృధా నిర్మూలన ప్రణాళిక, ఆహార భద్రత చట్టాలు మరియు చట్టాలలో ఉల్లంఘన శిక్షలు తెలియజేశారు. ఆహార వ్యాపార నిర్వాహకులకు చాలా అవసరమైన ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ (FOSTAC) శిక్షణా సంబంధిత విషయాలు వివరించారు. ఈ సమావేశంలో జేఈవో వీరబ్రహ్మం, డిప్యూటీ ఈవోలు ఆశాజ్యోతి, విజయలక్ష్మి, ఇంఛార్జ్ ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సునీల్ కుమార్, క్యాటరింగ్ ప్రత్యేక అధికారి జీఎల్‌ఎన్ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వెంకటేశ్వరరావు, తిరుమల ఫుడ్ సేఫ్టీ అధికారి జగదీష్, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఇతర ప్రతినిధులు, ఎపీటీడీసీ డివిజనల్ మేనేజర్ గిరిధర్ రెడ్డి, తిరుమలలోని పెద్ద, జనతా క్యాంటీన్ల నిర్వాహకులు పాల్గొన్నారు.
మరోవైపు తిరుమలలో హోటల్స్, క్యాంటీన్లపై టీటీడీ ఈవో జే శ్యామలరావు ఫోకస్ పెట్టారు.. ఇటీవల హోటల్స్‌లో తనిఖీలు చేపట్టారు.
ఓ హోటల్‌లో తయారు చేస్తున్న ఆహార పదార్థాలు, ముడి సరుకుల నిల్వ, శుభ్రపరచడం వంటి అంశాలను ప్రధానంగా పరిశీలించారు.
చాలా కూరగాయలు కుళ్లిపోగా.. పరిశుభ్రతచ పారిశుద్ధ్య చర్యలు నాసిరకంగా ఉన్నాయని గుర్తించారు. ఆ హోటల్‌లో భోజనం చేసిన కొందరు భక్తులు అస్వస్థతకు గురయ్యామంటూ టీటీడీకి ఈ మెయిల్స్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీంతో టీటీడీ ఈవో ఎఫ్‌ఎస్‌డి బృందంతో కలిసి హోటల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ హోటల్ నిర్వాహకులు ఆహార భద్రతా నిబంధనలను పాటించడం లేదని గుర్తించారు.. అపరిశుభ్రత వాతావరణంలో హోటల్‌లో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నట్లు తేలింది. మరోసారి ఇలాంటి దాడులు మరిన్ని ఉంటాయన్నారు. హోటల్‌లోని ఆహార పదార్థాల తయారీలో నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆ హోటల్ కిచెన్‌ను వెంటనే మూసివేసి.. దీనిపై విచారణ జరిపిన తర్వాత, హోటల్‌పై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇదిలా ఉండే ఎఫ్‌ఎస్‌డి డైరెక్టర్‌తో కలిసి ఈవో మొబైల్ ల్యాబ్, ‘ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్’ను టీటీడీ ఈవో శ్యామలరావు ప్రారంభించారు. ప్రత్యేకమైన ఈ వాహనం ఆహారం, నీటి నాణ్యతను తనిఖీ చేయడానికి అవసరమైన పరికరాలతో కూడిన ల్యాబ్ ఉంది. ఈ మొబైల్ ల్యాబ్‌లో 80 రకాల పదార్థాల నాణ్యతలను తనిఖీ చేసేందుకు అవకాశం ఉంది. ఈ వ్యవస్థతో ప్రత్యేకంగా తిరుమలలో ఆహారం, నీరు నాణ్యత ప్రమాణాలను పరిశీలించేందుకు వినియోగిస్తారు. ఇలా తిరుమలలో హోటల్స్, భక్తులకు అందిస్తున్న ఆహారంపై ఫోకస్ పెట్టారు.