మూడు నెలల్లో తిరుమలలో ఆ సమస్యకు చెక్.. టీటీడీ ఈవో హామీ

టీటీడీ ఈవో జె. శ్యామలరావు తిరుమలలో శుక్రవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరితో కలిసి పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గోగ‌ర్భం జ‌లాశ‌యం స‌మీపంలోని కాకుల‌మాను దిబ్బ వ‌ద్ద ఉన్న డంపింగ్ యార్డును టీటీడీ ఈవో తొలుత ప‌రిశీలించారు. దశాబ్దాల తరబడి పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. తిరుమలలో 30 ఏళ్ల నుంచి లక్ష మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయిందన్న టీటీడీ ఈవో శ్యామలరావు.. దీని వలన అనేక ఇబ్బందులు వస్తున్నాయన్నారు.

ఈ నేపథ్యంలోనే తిరుమల డంపింగ్ యార్డులోని చెత్తను తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ ఈవో వెల్లడించారు. ఈ చెత్త నుంచి దుర్వాసన రాకుండా ఇప్పటికే చర్యలు తీసుకున్నామన్న శ్యామలరావు.. డంపింగ్ యార్డులోని చెత్తను తరలించేందుకు తిరుపతి మున్సిపాలిటీ అధికారులతో ఇప్పటికే మాట్లాడినట్లు చెప్పారు. మొత్తం చెత్తను మూణ్నాలుగు నెలల్లో ఇక్కడి నుంచి తొలగిస్తామని.. రాబోయే రోజుల్లో చెత్తను శాస్త్రీయంగా డంపు చేసే విధానం అమల్లోకి తెస్తామన్నారు. ఇక తడి చెత్త కూడా ఎక్కువగా ఉందని.. బయోగ్యాస్ ప్లాంట్ అందుబాటులోకి వస్తే తగ్గే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే తడి చెత్త ద్వారా 20వేల టన్నుల కంపోస్టు ఎరువును తయారు చేసినట్లు వివరించారు.

అలాగే పాపవినాశనం వద్ద ఉన్న బాత్రూమ్‌లు, దుస్తులు మార్చుకునే గదులు, పార్కును పరిశీలించిన ఈవో.. పలు సూచనలు చేశారు. ఆటవీశాఖ అధికారులతో చర్చించి పార్కును అభివృద్ధి చేయాలన్నారు. సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే ఆకాశ‌గంగ తీర్థాన్ని పరిశీలించిన టీటీడీ ఈవో శ్యామలరావు.. మెట్ల మార్గంలో ఉన్న దుకాణాల ఆక్రమణలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. మెట్ల మార్గంలో దుకాణాల ఆక్రమణల ద్వారా భక్తుల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోందని.. ఈ నేపథ్యంలో దుకాణాల ఆక్రమణలను తొలగించాలని స్పష్టం చేశారు. మరోవైపు తిరుమలలోని డంపింగ్ యార్డును తరలించాలని ఇటీవల జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయానికి అనుగుణంగానే టీటీడీ చర్యలు తీసుకుంటోంది.

About amaravatinews

Check Also

కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు సర్కార్.. ఇక యాక్షన్ షురూ..!

అమ్మభాషకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఇకపై ఏపీలో ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులో వెలువడనున్నాయి. తెలుగుభాష పరిరక్షణకు అందరూ కృషి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *