తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ ఈవో గుడ్‌న్యూస్

తిరుమలలో ప్రక్షాళన కొనసాగుతోందన్నారు టీటీడీ ఈవో జే శ్యామలరావు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనలతో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టామని.. తాను ఈవోగా బాధ్యతలు తీసుకున్ని నెల రోజుల్లో ఎన్నో లోపాలను గుర్తించినట్లు చెప్పారు. క్షేత్రస్థాయిలో పరిశీలన తర్వాత మార్పులు, చేర్పులు చేయాల్సిన అవసరం ఉందని.. సీఎం సూచనలకు తగిన విధంగా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

తిరుమల శ్రీవారి ఆన్‌లైన్ దర్శన టిక్కెట్ల జారీ వ్యవస్థలో లోపాలు ఉన్నాయని.. త్వరలోనే ఆన్‌లైన్ టికెట్ల వ్యవస్థలో అవసరమైన మార్పులు చేస్తామన్నారు ఈవో శ్యామలరావు. రాబోయే రోజుల్లో దర్శన టికెట్లకు సంబంధించి పారదర్శకత తీసుకొస్తామని.. భక్తుల సమస్యల్ని సమీక్ష చేసేందుకు వీలుగా వ్యవస్థ లేదన్నారు. శ్రీవారి దర్శనాలకు వెళ్లే భక్తుల క్యూ లైన్ల పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఓ అధికారిని నియమించామని గుర్తు చేశారు. తిరుమలలో భక్తులకు సేవలందించడానికి ఉద్యోగుల కొరత ఉందని.. కావాల్సినవారి కంటే మూడోవంతు మాత్రమే అందుబాటులో ఉన్నారని చెప్పుకొచ్చారు.

అన్న ప్రసాదాల నాణ్యతను పెంచే దిశగా నిపుణుల సూచనలు తీసుకున్నామని.. అవసరమైన మార్పులు చేసి నాణ్యతను పెంచామన్నారు. క్యూ లైన్లలో భక్తులకు నిరంతరాయంగా అన్న ప్రసాదం, తాగునీరు పంపిణీ చేస్తున్నామన్నారు. క్యూ లైన్లలో కొత్తగా మూడు అన్నప్రసాద వితరణ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సముదాయంలో నిత్యం రెండు లక్షల మంది భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగుతోందన్నారు టీటీడీ ఈవో. నెయ్యిలో నాణ్యత లేకపోవడం వల్లే లడ్డూ నాణ్యత తగ్గిందని గుర్తించామని.. లడ్డూ నాణ్యత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

లడ్డూ ప్రసాదం నాణ్యత పెంచే దిశగా.. నాణ్యమైన నెయ్యి సేకరణపై దృష్టి పెట్టామన్నారు ఈవో. ముడిసరుకులు నాణ్యత పరిశీలనకు ఫుడ్ సేప్టి అండ్ స్టాండర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ల్యాబ్ కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే తిరుమలలో ఉన్న ప్రైవేట్‌ హోటల్స్‌ని బ్రాండింగ్ ఉన్న సంస్థలకు కేటాయించాలని నిర్ణయించినట్లు తెలిపారు. సర్వదర్శనం భక్తులకు వారానికి 1.65 లక్షల దర్శన టోకెన్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. టీటీడీ ఐటీ వ్యవస్థలో లోపాలను గుర్తించామని.. వాటిని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామన్నారు.

కొంత మంది భక్తులు ఒకే ఐడీతో, ఒకే మొబైల్ నంబర్‌తో వందల సార్లు టికెట్లు పొందినట్లు గుర్తించినట్లు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. త్వరలో ఆన్‌లైన్‌లో టికెట్ల బుకింగ్‌కి ఆధార్ కార్డుతో అనుసంధానం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. దళారులపై నమోదవుతున్న కేసులు విషయంలో పోలిసులు సరిగ్గా స్పందించడం లేదని గుర్తించామన్నారు. ఇలా టీటీడీ ప్రక్షాళనకు సంబంధించి వివరాలు వెల్లడించారు.

About amaravatinews

Check Also

ఎమ్మెల్యేలు, మంత్రులకు హాఫ్‌ ఇయర్లీ ఎగ్జామ్స్‌.. CBNతో అట్టా ఉంటది

బహుశా మీ అందరికీ కార్పొరేట్ కల్చర్‌ గురించి తెలిసే ఉంటుంది. MNC కంపెనీల్లో ఉద్యోగులకు KRA అని ఒకటి ఉంటుంది. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *