తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. శ్రీవారి దర్శనం, వసతికి సంబంధించిన టికెట్ల నవంబర్ కోటాను ఆగస్ట్ 19న టీటీడీ విడుదల చేయనుంది. ఈ మేరకు నవంబర్ నెలకు సంబంధించి టికెట్ల విడుదల షెడ్యూల్‌ను టీటీడీ వెల్లడించింది. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఆన్‌లైన్ కోటాను ఆగస్ట్ 19వ తేదీ ఉదయం పది గంటలకు విడుదల చేయనున్నారు. ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఆగస్ట్ 21వ తేదీ ఉదయం పదివరకూ ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. అలాగే ఈ టికెట్లు పొందిన భక్తులకు ఆగస్ట్ 21 నుంచి 23వ తేదీ మధ్యాహ్నం 12 లోపు సొమ్ము చెల్లించేందుకు అవకాశం ఇచ్చింది. ఇలా డబ్బులు చెల్లించిన వారికి లక్కీడిప్‍లో టికెట్లు కేటాయిస్తారు.
మరోవైపు సహస్రదీపాలంకార సేవ, ఊంజల్ సేవ, కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్లను ఆగస్ట్ 22వ తేదీ ఉదయం పదింటికి ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. వీటితో పాటుగా నవంబర్ 9న టీటీడీ శ్రీవారి ఆలయంలో పుష్పయాగం నిర్వహించనుంది. ఈ పుష్పయాగం టికెట్లను కూడా ఆగస్ట్ 22వ తేదీ ఉదయం పదింటికి ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. ఇక వర్చువల్ సేవలు, దర్శన స్లాట్లకు సంబంధించిన నవంబర్ కోటాను ఆగస్ట్ 22 మధ్యాహ్నం మూడింటికి విడుదల చేయనున్నారు.
Amaravati News Navyandhra First Digital News Portal