తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. టీటీడీ నవంబర్ నెలకు సంబంధించిన దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తోంది. ఇవాళ శ్రీవారి ఆలయంలో అంగప్రదక్షిణం టోకెన్ల నవంబరు నెలకు సంబంధించిన కోటాను ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. అంతేకాదు నేడు ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన నవంబరు నెల ఆన్ లైన్ కోటాను విడుదల చేస్తారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా నవంబరు నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది టీటీడీ.
అంతేకాదు ఆగస్టు 24 (శనివారం) ఉదయం 10 గంటలకు నవంబరు నెలకు సంబంధించిన ర.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. అలాగే ఆగష్టు 24న మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలలో నవంబరు నెల గదుల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. ఇటు ఆగష్టు 27న తిరుమల – తిరుపతి శ్రీవారి సేవ కోటా ఉదయం 11 గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ మధ్యాహ్నం 1 గంటకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. అంతేకాదు ఈ టికెట్లను https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవాలని టీటీడీ భక్తులకు సూచించింది.