తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు టీటీడీ నిర్దేశించిన రేట్లకే వాటర్ బాటిళ్లు విక్రయించాలని జేఈవో (విద్య, ఆరోగ్యం) గౌతమి చెప్పారు. తిరుమలలోని ఆరోగ్యశాఖ కార్యాలయంలో మంగళవారం దుకాణదారులతో సమావేశం నిర్వహించారు. తిరుమలలోని దుకాణదారులు టీటీడీ నిర్దేశించిన రేట్ల కంటే అధిక రేట్లకు వాటర్ బాటిళ్లు అమ్ముతున్నారని, కాళీ గాజు బాటిళ్లు తీసుకోవడం లేదని పలువురు భక్తులు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
టీటీడీ ఈవో ఆదేశాల మేరకు, తిరుమలలోని దుకాణదారులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తిరుమలలోని అన్ని దుకాణాలలో ఒకే రేటుతో వాటర్ బాటిళ్లు విక్రయించాలని, కాళీ గాజు బాటిల్ తీసుకొని భక్తులకు డబ్బులు తిరిగి ఇవ్వాలన్నారు. అదేవిధంగా దుకాణదారులు తమ దుకాణాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జేఈవో ఆదేశించారు. ఇందుకు దుకాణదారులు తమ అంగీకారం తెలిపారు. ఈ సమావేశంలో ఆరోగ్యశాఖ డిప్యూటీ ఈవో ఆశాజ్యోతి, ఇంచార్జ్ హెల్త్ అధికారి డాక్టర్ సునీల్ కుమార్, ఆరోగ్యశాఖ అధికారులు, దుకాణదారులు పాల్గొన్నారు.