షేక్‌పేట్ రోడ్డుప్రమాద ఘటనతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అలెర్ట్ అయ్యారు. నో ఎంట్రీ సమయం తర్వాత సిటీలోకి వస్తున్న భారీ వాహనాలు, ప్రైవేట్ ట్రావెల్ బస్సులపై కొరఢా ఝుళిపిస్తున్నారు. పంజాగుట్ట సర్కిల్‌లో తనిఖీలు చేపట్టిన ట్రాఫిక్ పోలీసులు.. ప్రైవేట్ ట్రావెల్ బస్సులు, వాటర్ ట్యాంకర్స్, మినీ లోడ్ వాహనాలపై ఫైన్‌లు విధించారు.
ప్రజల ప్రాణాలంటే వేళాకోలంగా ఉందా?…లారీలను, హెవీ వెహికల్స్‌ను వేళాపాళాలేకుండా సిటీలోకి ఎలా అనుమతిస్తున్నారు? నో ఎంట్రీ నిబంధనలు తుంగలో తొక్కుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? నో ఎంట్రీ టైమ్‌లో సిటీలోకి దూసుకొచ్చిన లారీ చిన్నారి అధర్విని బలి తీసుకుంది. ఆ ఘటనపై ఆగ్రహం వెల్లువెత్తుతోంది. నో ఎంట్రీ ఉత్తర్వులు ఇచ్చారు సరే..అమలు మాటేంటి? అని ప్రశ్నిస్తున్నారు మహానగర వాసులు..
నో ఎంట్రీ సమయాల్లో సిటీలోకి దూసుకొస్తున్న లారీలు, టిప్పర్లు, ట్యాంకర్లు బతుకుల్ని బలితీసుకుంటున్నాయి. రోడ్లను రక్తసిక్తం చేసేస్తున్నాయి. గతేడాది ఆగస్టులో హబ్బిగూడలో సాత్విక.. తాజాగా షేక్‌పేట చిన్నారి అథర్వి..లారీ యాక్సిడెంట్‌లో సమిథలయ్యారు. రెండు ఘటనలకు కారణం..నో ఎంట్రీ నిబంధనలకు విరుద్ధంగా సిటీలోకి లారీలు దూసుకు రావడమే
స్పీడ్‌కు లిమిట్ ఉండదు.. మరి నో ఎంట్రీ టైమింగ్ కైనా విలువ వుందా?.. ఉండే వుంటే .. నిబంధనలకు విరుద్ధంగా నగరంలోకి వస్తోన్న లారీలను టిప్పర్లను హెవీ వెహికల్స్‌ను అడ్డుకుని వుంటే.. బడిబాటలో బంగారు తల్లుల భవిష్యత్ ఇలా చిద్రమైది కానేకాదు..
షేక్‌పేటలో బైక్‌ను లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. కిందపడిన చిన్నారి అథర్వీపై నుంచి లారీ దూసుకెళ్లింది. చిట్టి తల్లి స్పాట్‌లో చనిపోయింది. తండ్రి పక్కకు పడిపోయాడు.కానీ ఆ దృశ్యం చూసి నాన్న గుండె కాదు..అక్కడున్న వాళ్లందరు కన్నీటి పర్యంతమయ్యారు.
నో ఎంట్రీ నిబంధనలున్నా సరే లారీలు, టిప్పర్లు.. ట్యాంకర్లు ఇష్టారాజ్యంగా సిటీలోకి వస్తున్నందు వల్లే ప్రమాదాలు..దారుణాలు.. ఇంత అనర్ధం జరుగుతున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నిస్తున్నారు నగరవాసులు
వేళాపాళ లేకుండా.. స్పీడ్ లిమిట్ పాటించకుండా దూసుకొస్తున్న లారీలు టిప్పర్లు మరణమృదంగం మోగిస్తున్నాయి. ఘట్‌కేసర్ శివారు కాచవాని సింగారంలో టిప్పర్ ఢీకొవడంతో తేజ చౌదరి అనే విద్యార్థి చనిపోయాడు. ఈ దారుణానికి టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమన్నారు స్థానికులు.
షేక్‌పేటలో అథర్వీ ఘటన నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అలెర్టయ్యారు. నో ఎంట్రీ టైమ్‌లో లారీలు, ట్రక్కులుహెవీ వెహికల్స్ ఎట్టి పరిస్థితుల్లో సిటీలోకి ఎంటర్ కాకుండా చర్యలు చేపడుతామన్నారు ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డె. రూల్స్‌ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
స్కూల్ టైమింగ్స్‌లో సిటీలోకి లారీలు, టిప్పర్లు. హెవీ వెహికల్స్‌కు ప్రవేశం నిషేధం. ఇది క్రిస్టల్ క్లియర్. ఇక గతేడాది ఫిబ్రవరిలోనే ఉత్తర్వులు జారీ అయ్యాయి. మరి అమలు అటకెక్కిందా? అమలు చేసి వుంటే ఈదారుణాలు జరిగేవా? అసలు నో ఎంట్రీ సమయాల్లో లారీలు, టిప్పర్లను సిటీలోకి ఎలా అనుమతినిస్తున్నారు? ప్రమాదాలకు ప్రత్యక్షంగా లారీ డ్రైవర్లు కారణమైతే..పరోక్షంగా నిర్లక్ష్యం ఎవరిది? బడిబాటలో చిన్నారులను చిదిమేస్తున్న ఈ దారుణాలు ఎవరి నిర్లక్ష్యం చేస్తున్న హత్యలు?అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నగరవాసులు..
పోలీసుల తనిఖీలు..
కాగా..షేక్‌పేట్ రోడ్డుప్రమాద ఘటనతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అలెర్ట్ అయ్యారు. నో ఎంట్రీ సమయం తర్వాత సిటీలోకి వస్తున్న భారీ వాహనాలు, ప్రైవేట్ ట్రావెల్ బస్సులపై కొరఢా ఝుళిపిస్తున్నారు. పంజాగుట్ట సర్కిల్‌లో తనిఖీలు చేపట్టిన ట్రాఫిక్ పోలీసులు.. ప్రైవేట్ ట్రావెల్ బస్సులు, వాటర్ ట్యాంకర్స్, మినీ లోడ్ వాహనాలపై ఫైన్‌లు విధించారు. నిబంధనలు పాటించని వాహనాలకు 4వేలకు పైగా చలాన్స్ వేయడంతోపాటు.. నో ఎంట్రీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నారు.