రెండున్నరేళ్లుగా సాగుతోన్న ఉక్రెయిన్, రష్యా యుద్ధం ఊహించని మలుపు తిరిగింది. యుద్ధం మొదలైన తర్వాత తొలిసారిగా రష్యా భూభాగంలోకి ఉక్రెయిన్ దళాలు చొచ్చుకెళ్లారు. వారం రోజుల కిందట కుర్స్క్ రీజియన్‌లోకి ప్రవేశించిన కీవ్ సేనల దూకుడు ముందు మాస్కో సైన్యాలు తలవంచుతున్నాయి. రష్యా భూభాగాలను ఉక్రెయిన్ సైనికులు తమ నియంత్రణలోకి తీసుకున్నట్లు సమాచారం. కస్క్ రీజియన్‌లో దాదాపు 1000 చదరపు కిలోమీటర్ల మేర భూభాగం స్వాధీనం చేసుకున్నట్టు ఉక్రెయిన్ సైనిక కమాండర్ జనరల్ ఒలెక్సాండర్ సిర్‌స్కీ ప్రకటించారు.
అటు, రష్యాలోకి తమ సేనలు ప్రవేశించిన విషయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీ మొదటిసారి ధ్రువీకరించారు. ఈ సందర్భంగా తమ సైనికుల ధైర్యసాహసాలను అభినందించిన జెలెన్‌స్కీ.. ఆ ప్రాంతంలో మానవతా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు, ఇతరులపై రష్యా ప్రారంభించిన యుద్ధం.. ఇప్పుడు ఆ దేశానికే తిరిగి వస్తుందని వ్యాఖ్యానించారు.
మరోవైపు, ఈ చొరబాటుపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందిస్తూ.. డాన్‌బాస్‌లో మాస్కోను నిలువరించేందుకు కీవ్ చేసిన ప్రయత్నంగా పేర్కొన్నారు. అయితే, ఉక్రెయిన్ సైన్యంతో సాగుతున్న భీకర పోరులో రష్యా తప్పక విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రష్యా ఉన్నతస్థాయి రక్షణ, భద్రతాధికారులతో సమావేశమైన పుతిన్.. ఆగస్టు 6న ఉక్రెయిన్ దాడులు ప్రారంభమైనట్టు తెలిపారు. యుద్ధం ముగింపునకు సంబంధించిన చర్చల్లో మెరుగైన స్థితిలో ఉండేందుకే ఆ దేశం ఈ చర్యలకు పాల్పడుతున్నట్లు పుతిన్ ఆరోపించారు. ‘శత్రువు స్పష్టమైన లక్ష్యాలలో ఒకటి అసమ్మతి, కలహాలు, ప్రజలను భయపెట్టడం, రష్యన్ సమాజం ఐక్యతను దెబ్బతీయడం’అని మంిపడ్డారు.
ఇరు సైన్యాలు భీకర దాడులతో కస్క్ రీజియన్‌లో 1.21 లక్ష మంది పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరో 60 వేల మందిని అక్కడ నుంచి తరలించే ప్రయత్నాల్లో ఉన్నారు. పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని, 28 గ్రామాలను ఉక్రెయిన్ దళాలు స్వాధీనం చేసుకున్నాయని కస్క్ గవర్నర్ వెల్లడించారు. దాడుల్లో 12 మంది పౌరులు చనిపోయినట్టు ఆయన తెలిపారు. గత మంగళవారం రష్యా భూభాగంలోకి మొదటిసారి ప్రవేశించిన ఉక్రెయిన్ సైన్యాలు.. సరిహద్దుల నుంచి 30 కి.మీ. దూరం చొచ్చుకొచ్చాయి. ఇది ఉక్రెయిన్‌కు నైతికస్థైర్యాన్ని కలిగించినా.. మరో ముప్పుగా మారుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ పరిణామాలతో రగిలిపోతున్న మాస్కో.. ఉక్రెయిన్ పౌరులు, మౌలిక వసతులపై దాడులను రెట్టింపు చేసే ప్రమాదం ఉందని బ్రిటిషన్ సైన్యానికి చెందిన సీనియర్ అధికారి ఒకరు అన్నారు. యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లోని సహాయక శిబిరాల్లో ఉన్న ప్రజలకు అంతర్జాతీయ సంస్థలు ఆహారం సహా మానవతా సాయం అందిస్తున్నాయి.