ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో ఉన్న విజయవాడకు కేంద్రం తీపికబురు చెప్పింది. ముఖ్యమంత్రి చంద్రబాబు రిక్వెస్ట్‌తో విజయవాడతో పాటుగా అమరావతికి కీలకమైన పలు జాతీయరహదారుల ప్రాజెక్టులు దక్కాయి. తాజాగా విజయవాడ తూర్పు బైపాస్, విజయవాడలో 7 కి.మీ. మేర సూపర్‌స్ట్రక్చర్ వంతెన నిర్మాణం వంటి ప్రాజెక్టులకు సంబంధించి మరో ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టుల్ని ఎన్‌హెచ్‌ఏఐ (జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ) 2024-25 వార్షిక ప్రణాళికలో చేర్చింది. వీటితో పాటుగా రాష్ట్రంలో 9 ప్రాజెక్టులను వార్షిక ప్రణాళికలో చేర్చారు. ఈ మేరకు ఆ ప్రాజెక్టులకు రూ.12,029 కోట్లను కేంద్రం మంజూరుచేసింది. ఈ ప్రక్రియ పూర్తి కావడంతో..ఈ ప్రాజెక్టులకు త్వరగా డీపీఆర్ రూపొందించి, భూసేకరణ పూర్తిచేస్తే.. వెంటనే టెండర్లు పిలిచి, పనులు అప్పగించే వీలు కలిగింది.
ప్రస్తుతం చిన్నఅవుటపల్లి నుంచి కాజా వరకు నిర్మిస్తున్న విజయవాడ బైపాస్‌కు ఎదురుగా.. తూర్పువైపు మరో బైపాస్ నిర్మాణానికి సిద్ధమైంది ఎన్‌హెచ్‌ఏఐ. ఈ బైపాస్‌కు రూ.2,716 కోట్లు కేటాయించగా.. 50 కిలో మీటర్ల మేర నిర్మించాలనుకుంటున్నారు. దీని కోసం సలహా సంస్థ మూడు ఎలైన్‌మెంట్లు సిద్ధం చేయగా.. ఈ వారంలో ఎన్‌హెచ్‌ఏఐ అధికారులుకృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ ప్రాజెక్ గురించి చర్చించి.. నెలాఖరుకు మూడు ఎలైన్‌మెంట్లను ఎన్‌హెచ్‌ఏఐ ప్రధాన కార్యాలయానికి పంపుతారు.. అప్పుడు వాటిలో ఒకటి ఖరారు కాగానే.. డీపీఆర్, భూసేకరణ చేస్తారు.