ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం శుభవార్త చెప్పింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమల్లో భాగంగా కేంద్రం రాష్ట్రానికి అదనంగా 6.50 కోట్ల పనిదినాలు కేటాయించిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. మొదట మంజూరు చేసిన 15 కోట్ల పనిదినాలు జూన్ నెలాఖరుకే పూర్తికాగా.. కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో అదనపు అవసరాలను దృష్టిలో పెట్టుకుని.. మరో 6.50 కోట్ల పనిదినాలకు ఆమోదం తెలిపినట్లు పవన్ తెలిపారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పని దినాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. అంతేకాదు కూలీలకు చెల్లించాల్సిన బకాయిలకు కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు.
రాష్ట్రంలో అటవీశాఖ ఉద్యోగులపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. పల్నాడు జిల్లాలో జరిగిన ఘటనపై సీరియస్‌గా స్పందించారు. విజయపురి సౌత్‌రేంజ్ అటవీ పరిధిలో వన్యప్రాణులను అక్రమ రవాణా చేసే ముఠా ఆటకట్టించారు అధికారులు. వారిని అదుపులోకి తీసుకునే క్రమంలో అటవీశాఖ ఉద్యోగులపై జరిగిన దాడిని పవన్ కళ్యాణ్ ఖండించారు. పల్నాడు జిల్లా కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడిన డిప్యూటీ సీఎం.. ఆ ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. అటవీశాఖ అధికారులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని.. అటవీ పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు వన్యప్రాణి సంరక్షణ చట్టాలపై అవగాహన కల్పించాలని సూచించారు.
మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో అమెరికా కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ భేటీ అయ్యారు. మంగళగిరిలోని పవన్ కళ్యాణ్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో పెట్టుబడులు, అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టేందుకు ఉన్న అవకాశాలపై ప్రధానంగా చర్చించారు. రాష్ట్రంలో రాజకీయ స్థిరత్వమున్న ప్రభుత్వం ఉందని, పెట్టుబడులను ప్రోత్సహించే సానుకూలత తమకు ఉందన్నారు. రాష్ట్రంలో సాంకేతికతను అందిపుచ్చుకునే నైపుణ్యం ఉన్న యువత రాష్ట్రంలో ఉన్నారని.. వారి ప్రతిభకు తగిన అవకాశాలు కల్పించాలని కోరారు. రాష్ట్రం నుంచి ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లే వారికి తగిన సహకారం అందించాలని లార్సన్‌ను డిప్యూటీ సీఎం కోరారు.