ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి పోలవరంపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. పోలవరంపై లోక్‌సభలో ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, జీఎం హరీష్ బాలయోగి అడిగిన ప్రశ్నకు కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్ ఈ మేరకు సమాధానమిచ్చారు. గత మూడేళ్లలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సాగిన తీరుపై ప్రశ్నించారు. తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు పనుల అంశంపై క్లారిటీ ఇచ్చారు. 2026 మార్చి నాటికి తొలి దశ పనులు పూర్తవుతాయని ప్రకటించారు. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయన్నారు కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఆలస్యానికి కాంట్రాక్టర్ మార్పు, భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాలు నిదానంగా జరిగాయన్నారు పాటిల్. దీనికి సంబంధించిన అంశాలే కారణమని ఐఐటీ హైదరాబాద్ 2021 నవంబరులో ఇచ్చిన నివేదికలో పేర్కొందని గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ 2021 ఆగస్టులో పోలవరం నిర్మాణ పనుల ఆలస్యానికి కారణాలను గుర్తించే బాధ్యతను హైదరాబాద్ ఐఐటీకి అప్పగించినట్లు ఆయన తెలిపారు. 2021 నవంబర్‌లో ఆ సంస్థ నివేదిక ఇచ్చిందన్నారు.
కాంట్రాక్టర్ మార్పిడి, భూసేకరణ, సహాయ, పునరావాస కార్యక్రమాలు నిదానంగా సాగాయని ఆ సంస్థ తెలిపిందన్నారు కేంద్రమంత్ర పాటిల్. కొవిడ్, దానికి సంబంధించిన అంశాలు ప్రాజెక్టు నిర్మాణంలో ఆలస్యానికి ప్రధాన కారణాలుగా తేలిందన్నారు. 2021-22 నుంచి 2023-24 మధ్య మూడేళ్ల కాలంలో కేంద్రం రూ.8,044.31 కోట్లు అందించినట్లు చెప్పారు. 2014 ఏప్రిల్ 1 నుంచి ఈ ప్రాజెక్టు మిగిలిన పనుల నిర్మాణ వ్యయాన్ని 100% కేంద్రం సమకూర్చనుందని.. కేంద్రం తరఫున నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతోందన్నారు పాటిల్.
మరోవైపు ఏపీ కేబినెట్ సమావేశంలో పోలవరం అంశం కూడా చర్చకు వచ్చింది. పోలవరానికి అవసరమైన నిధుల్ని కేంద్రమే ఇవ్వాలని.. విభజన చట్టంలో పేర్కొన్నట్లుగా ఈ ప్రాజెక్టు నిర్మించేందుకు అవసరమైన సాయం కేంద్రం అందించాలని మంత్రివర్గం తీర్మానించింది. పోలవరం ప్రాజెక్టు తాజా స్థితిగతులపై చర్చించి కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించారు. పోలవరం 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించాలని.. దీనికి సంబంధించి డీపీఆర్ ప్రకారం మొత్తం అన్ని ప్రయోజనాలూ దక్కేలా చేపట్టే పనులకు పూర్తిగా నిధులను కేంద్రమే ఇవ్వాలని కోరనున్నారు. పోలవరం ప్రాజెక్టు మొత్తం నిర్మాణానికి అవసరమైన అన్ని నిధులు ఇస్తామని.. అలాగే ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత తమదని కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించినందుకు మంత్రివర్గం ధన్యవాదాలు తెలిపింది. కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి అనుమతులూ ఇవ్వాలని కేంద్రాన్ని రిక్వెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి తెలియజేసిన ఈ వివరాలను కేంద్రానికి పంపిన తీర్మానించారు.