సెయిల్‌లో స్టీల్ ప్లాంట్‌ విలీనంపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు

సెయిల్‌లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ విలీనానికి కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించిందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల మంత్రి, నర్సాపురం బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమలో పెట్టుబడుల ఉపసంహరణపై ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తున్నామని, ప్లాంట్ నష్టాలను భర్తీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం పదే పదే ప్యాకేజీలు ఇవ్వలేదని కేంద్ర ఉక్కు,భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తేల్చి చెప్పారు. సెయిల్‌లో వీలీనానికి కొన్ని సాంకేతిక సమస్యలు అడ్డంకిగా ఉన్నాయన్న ఆయన.. అయినా ముందుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

శనివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెయిల్‌ ఆధ్వర్యంలో పనిచేస్తున్న అన్ని సంస్థలూ లాభాల్లో ఉన్నాయని, అందులో విశాఖ ఉక్కును విలీనం చేసే అంశంపై చర్చలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ‘ప్రత్యామ్నాయ అవకాశాలను మీడియా ముఖంగా వెల్లడించలేను.. విశాఖ ఉక్కు సెంటిమెంట్, కార్మికుల ఆందోళనను గౌరవిస్తాం.. రెండు మూడేళ్ల తర్వాత మరో ప్యాకేజీ అవసరం రాకుండా శాశ్వత పరిష్కారం కనుక్కుంటాం..

విశాఖ ఉక్కు పరిశ్రమను లాభాల్లో నడిపించి, ఉద్యోగాలకు భద్రత కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. కేంద్రం ద్వారా సాయం అందించి, లాభాల్లోకి తీసుకురావాలనే దానిపై లోతుగా అధ్యయనం జరుపుతున్నాం.. రాబోయే రోజుల్లో పరిశ్రమను సొంతకాళ్లపై నిలబెట్టేందుకు కసరత్తు చేస్తున్నాం.. దీనిపై సెయిల్‌ ఉన్నతస్థాయి అధికారులతో సమావేశమయ్యాను.. అది లిమిటెడ్‌ కంపెనీ.. అందులో ప్రస్తుతం నష్టాల్లో ఉన్న విశాఖ ఉక్కు విలీనానికి కొన్ని సాంకేతిక సమస్యలు వస్తాయి.. వాటిని ఎలా అధిగమించాలన్న అంశంపై చర్చిస్తున్నాం.

వైజాగ్ స్టీల్‌ ప్లాంట్‌ వద్ద ఉన్న అదనపు భూమిలో 1,500 ఎకరాలను ఎన్‌ఎండీసీకి అప్పగించి, ఆర్థిక వనరుల్ని సమీకరించుకొని పెల్లెట్స్‌ పరిశ్రమను ఏర్పాటుచేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా ఉంది. దీనిపై ఎన్‌ఎండీసీ ఛైర్మన్‌తో చర్చించాం.. నష్టాలను భరించే శక్తి కేంద్రానికి పదే పదే ఉండదు.. ఎంత మంది ఉద్యోగులు, ఉత్పత్తి ఎంత అనే వాస్తవాలు నా దగ్గర ఉన్నాయి.. కానీ, కార్మికుల ప్రయోజనాలు కాపాడాలి.. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను లాభాల్లోకి తీసుకురావాలి.. ఇదే మా ఆలోచన. లాభాలను ఎప్పుడు పోల్చగలం. ఏడాదికి రూ.4వేల కోట్లు పోతున్నాయి. చాలా బకాయిలు ఉన్నాయి. చేయూతనిచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది.. గతంలో ప్యాకేజీ ఇచ్చాం. మళ్లీ ప్యాకేజీ అడుగుతున్నారు. మూడేళ్ల తర్వాత మళ్లీ ప్యాకేజీ అడుగుతారు. మళ్లీ రెండేళ్ల తర్వాత ప్యాకేజీ అవసరం ఉంది’ అని కేంద్రమంత్రి వర్మ అన్నారు.

About amaravatinews

Check Also

తల్లి మరణం.. మృతదేహం పక్కనే రోదిస్తూ కూతురు కూడా..! కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన

విజయనగరం జిల్లా భోగాపురంలో విషాద ఘటన. 74 ఏళ్ల వనజాక్షి అనారోగ్యంతో మరణించగా, ఆమె కుమార్తె విజయలక్ష్మి తీవ్ర దుఃఖంతో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *