గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక పద్మ అవార్డులను ప్రకటించింది. సినీ కళాతమల్లికి అందించిన సేవలకు గుర్తింపుగా నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్ పురస్కారం దక్కింది. దీంతో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ నందమూరి హీరోకు అభినందనలు తెలియజేస్తున్నారు.
సినీ నటులు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డ్ రావడం పట్ల ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. హైదరాబాద్‌లో బాలకృష్ణ ఇంటికి వెళ్లిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. వివిధ రంగాల్లో ప్రజలకు సేవలు అందిస్తున్న బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డ్ ప్రకటించిన కేంద్రానికి ధన్యవాదాలు చెప్పారు కిషన్‌రెడ్డి. బాలకృష్ణకు పద్మభూషణ్ పురస్కారం ప్రకటించడంపై కేంద్రమంత్రి హర్షం వ్యక్తం చేశారు.ఇక పద్మభూషణ్ అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు నందమూరి బాలకృష్ణ. కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పిన ఆయన.. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కిషన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వండి..
‘ఎన్టీఆర్ తనయుడిగా పుట్టడం నా అదృష్టం. ఎన్టీఆర్ నాకు తండ్రి మాత్రమే కాదు. నాకు గురువు కూడా. ఈ అవార్డు నాలో మరింత స్ఫూర్తిని నింపుతుందని భావిస్తున్నాను. ఎన్టీఆర్‌కు భారతరత్న పురస్కారం ఇవ్వాలని కిషన్ రెడ్డికి నా విన్నపం. ఇది నా ఒక్కడి కోరిక కాదు.. తెలుగు ప్రజలందరి కోరిక. పద్మభూషణ్‌ను ఒక బిరుదుగా కంటే బాధ్యతగానే భావిస్తున్నాను. మేం ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా పనిచేస్తున్నాం. నా అభిమానులు కూడా నా నుంచి ఏమీ ఆశించడం లేదు. నేను చేసే సినిమాలు, మంచి పనులే వారు ఆశిస్తారు. చేస్తున్న మంచి పనులు మరింత కొనసాగించేలా ఈ అవార్డు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది’ అని బాలకృష్ణ చెప్పుకొచ్చారు.