విశాఖ ఎయిర్‌పోర్టులో కొత్త సేవలు.. ఇక ఆ ఇబ్బందులు తప్పినట్లే..

ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. విశాఖపట్నం విమానాశ్రయంలో నూతన సేవలు అందుబాటులోకి వచ్చాయి. విశాఖ విమానాశ్రయం నుంచి నిత్యం ఎంతోమంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ క్రమంలోనే ఎయిర్‌పోర్టు కార్యకలాపాలను మరింత సులభతరం చేసేందుకు కేంద్రం విశాఖపట్నం విమానాశ్రయంలో డిజి యాత్ర సేవలు అందుబాటులోకి తీసుకువచ్చింది. శుక్రవారం కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ సేవలను ప్రారంభించారు. విశాఖపట్నంతో పాటుగా రాంచీ, భువనేశ్వర్, ఇండోర్, రాయ్‌పూర్, పట్నా, గోవా, కోయబత్తూరు సహా 9 చోట్ల డిజి యాత్ర సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.. తాజాగా ప్రారంభించిన వాటితో కలిపి దేశంలోని 24 విమానాశ్రయాల్లో డిజి యాత్ర సేవలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.

ఇక సుమారుగా 3 కోట్ల మంది ప్రయాణికులు డిజి యాత్ర సేవలను వినియోగించుకున్నారని కేంద్ర మంత్రి తెలిపారు. ఇదో విప్లవాత్మకమైన మార్పుగా పేర్కొన్న రామ్మోహన్ నాయుడు.. దీని ద్వారా ప్రయాణికులు విమానాశ్రయంలోని సులభంగా ప్రవేశించవచ్చని తెలిపారు. ఇక అక్టోబర్ 27 నుంచి విశాఖపట్నం- విజయవాడకు ఉదయం విమాన సర్వీసును నడుపుతామని తెలిపారు. అలాగే మరో రెండేళ్లలో భోగాపురం ఎయిర్‌పోర్టు పనులను పూర్తిచేసామని.. ఏపీలో మరిన్ని విమానాశ్రయాలు ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి వెల్లడించారు.

మరోవైపు డిజి యాత్ర సేవలు అందుబాటులోకి రావటంతో ప్రయాణికులు ఇకపై డిపార్చర్ గేట్, ప్రి సెక్యూరిటీ హోల్డ్ ఏరియా, బోర్డింగ్ పాయింట్ వద్ద టికెట్, బోర్డింగ్ పాస్, ఐడెంటిటీ కార్డు చూపించాల్సిన అవసరం లేదు. డిజి యాత్ర యాప్ డౌన్ లోడ్ చేసుకోవడం ద్వారా సులభంగా ప్రవేశించవచ్చు. డిజి యాత్ర యాప్.. ఫేసియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా పనిచేస్తు్ంది. డిజి యాత్రలో నమోదు చేసుకునేందుకు పేరు, ఈమెయిల్, మొబైల్ నంబర్, గుర్తింపుకార్డు వివరాలను డిజి యాత్ర యాప్‌లో అందించాల్సి ఉంటుంది. ఇవన్నీ పూర్తి చేసిన తర్వాత డిజి యాత్ర ఐడీ క్రియేట్ అవుతుంది. ఈ నంబర్‌ను ప్రయాణికులు టికెట్లు బుక్ చేసే సమయంలో ఉపయోగించాల్సి ఉంటుంది.

ఇక ఎంట్రీ పాయింట్ వద్ద ప్రయాణికులు తమ బోర్డింగ్ పాస్ స్కాన్ చేయాలి. బార్‌కోడ్/క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయడం ద్వారా సిస్టమ్ ప్రయాణికుల వివరాలు , విమాన వివరాలను ధృవీకరిస్తుంది. ఆ తర్వాత డిజి యాత్ర ID ఫేసియల్ రికగ్నిషన్ ద్వారా గుర్తింపును ధృవీకరిస్తుంది. టికెట్, డిజి యాత్ర ఐడీ ధ్రువీకరణ పూర్తైన తర్వాత గేట్ తెరుచుకుంటుంది. 2022లో బెంగళూరు, వారణాసి, ఢిల్లీ ఎయిర్ పోర్టులలో ఈ డిజి యాత్ర సేవలను ప్రారంభించారు. దీని ద్వారా విమాన ప్రయాణికులు ఎయిర్ పోర్టులోని చెక్ పాయింట్ల వద్ద ఎలాంటి పేపర్లు అవసరం లేకుండా కాంటాక్ట్ లెస్ విధానం సులభంగా ప్రవేశించవచ్చు. దీని ద్వారా సమయం కూడా ఆదా అవుతుందని అధికారులు చెప్తున్నారు.

About amaravatinews

Check Also

కార్తీక పౌర్ణమి రోజున ఈ రెమెడీస్ చేయండి.. లక్ష్మీదేవి అనుగ్రహంతో సంపదల వర్షం కురుస్తుంది..

కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కార్తీక పూర్ణిమ రోజున గంగాస్నానం చేయడం విశేషంగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *