అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ అద్బుత విజయాన్ని అందుకున్నారు. దీంతో అమెరికాకు 47వ అధ్యక్షుడిగా రెండోసారి ఆయన శ్వేతసౌధంలోకి అడుగుపెట్టనున్నారు. ట్రంప్ విజయంపై ప్రపంచ దేశాధినేతలు, వ్యాపారవేత్తలు, ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం ఆయనకు శుభాకాంక్షలు తెలిపి.. ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతం, ప్రపంచ స్థిరత్వం, శాంతికి కలిసి పనిచేద్దామని సూచించారు. కాగా, ట్రంప్‌నకు అభినందనలు తెలుపుతూ.. భారతీయ చెఫ్ వికాస్ ఖన్నా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. గతంలో తనకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నట్లు వికాస్ ఖన్నా పోస్ట్ పెట్టారు.
హలో మిస్టర్ ప్రెసిడెంట్..! చివరిసారి మనం భారత్‌లో కలిసినప్పుడు అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో భారతీయ వంటకాలను రుచి చూపించే అవకాశాన్ని కల్పిస్తానని మాటట ఇచ్చారు.. చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తారని ఆశిస్తున్నా’’ అంటూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వికాస్ ఖన్నా పోస్ట్ పెట్టారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఫిబ్రవరి 2020లో భారత్ పర్యటనకు వచ్చినప్పుడు ఆయనతో కరచాలనం చేస్తూ దిగిన ఫొటోను షేర్ చేశారు.
ట్రంప్ భారత పర్యటన సందర్భంగా నాటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో విందు ఏర్పాటు చేసిన సందర్భంగా భారతీయ వంటకాలను అమెరికా అధ్యక్షుడు రుచి చూశారు. ఈ సమయంలో అక్కడ ఉన్న వికాస్ ఖన్నాతో ఈ ఫొటో దిగినట్లు తెలుస్తోంది. అస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ కూడా అందులో కనిపిస్తున్నారు.