ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మరికొన్ని రోజుల్లో జరగనున్న మహా కుంభమేళా కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కోట్లాదిమంది భక్తులు రానున్న నేపథ్యంలో మహా కుంభమేళాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే భద్రత, ఇతర తక్షణ అవసరాల కోసం పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ డిపార్ట్‌మెంట్‌లను సర్కార్ అలర్ట్ చేస్తోంది. అయితే ఎప్పుడూ లేని విధంగా ఈసారి మహా కుంభమేళాలో తొలిసారి రోబోలను వినియోగిస్తున్నారు. కుంభమేళాలో ఎలాంటి అగ్ని ప్రమాదాలు తలెత్తకుండా రోబోటిక్ ఫైర్ టెండర్లను అధికారులు రంగంలోకి దించారు.
వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న ఈ మహా కుంభమేళాలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా రోబోటిక్ ఫైర్ టెండర్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. వీటితోపాటు మరో 200 ఫైర్ కమాండోలను కూడా అందుబాటులో ఉంచనున్నట్లు ఉత్తర్‌ప్రదేశ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ పద్మజా చౌహాన్ వివరించారు. ఇక ఎమర్జెన్సీ సమయాల్లో ఫైర్ సిబ్బంది వెళ్లలేని ప్రాంతాలకు వెళ్లి.. బాధితులను రక్షించేందుకు 3 రోబోటిక్ ఫైర్ టెండర్లను ఉపయోగించనున్నట్లు తెలిపారు. ఇక ఈ ఒక్కో రోబోటిక్ ఫైర్ టెండర్ 20 నుంచి 25 కిలోల బరువు ఉంటుందని.. ఇవి మెట్లు ఎక్కడంతో పాటు మంటలను కూడా అదుపులోకి తీసుకువస్తాయని పేర్కొన్నారు.