సంక్రాంతికి వస్తున్నాం అంటూ అనిల్ రావిపూడి, వెంకటేష్ గత కొన్ని రోజులుగా చేస్తున్న ప్రమోషన్స్, ఆ హంగామా అందరికీ తెలిసిందే. ఇక వద్దురా బాబు.. వదిలేయండి.. కచ్చితంగా సినిమా చూస్తాం.. మీ ప్రమోషన్స్ చూడలేకపోతోన్నాం అంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టే దాక పరిస్థితి వచ్చింది. అయితే అనిల్ రావిపూడి మీద ఓ ముద్ర ఉంది. పాత కథనే అటు తిప్పి ఇటు తిప్పి ఏదో ఒక కామెడీ ట్రాక్ పెట్టించి ఆడియెన్స్ ఎంగేజ్ చేస్తుంటాడన్న మార్క్ అయితే ఉంది. అందుకే ఎంత ట్రోలింగ్ జరిగినా కూడా అనిల్ రావిపూడి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుంటాయి.
ఇక ఈ సారి సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాకు కేవలం కామెడీ అని కాకుండా.. క్రైమ్ జానర్‌ను కూడా యాడ్ చేశారు. క్రైమ్ జానర్ అంటే అదేదో సీరియస్ మోడ్‌లో సాగే సినిమా అనుకుంటే పొరబాటే. ఇప్పటి వరకు వచ్చిన టీజర్, ట్రైలర్‌లను పట్టి చూస్తే భార్య, మాజీ లవర్‌ల మధ్య ఇరుక్కుపోయే భర్త, ఆ భర్త పడే కష్టాల్ని ఫన్నీగా చూపించినట్టుగా కనిపిస్తోంది. ఈ కథ మొత్తం సంక్రాంతి పండుగ చుట్టూ జరుగుతుంది. అందుకే కథకు తగ్గట్టుగా టైటిల్ పెట్టామని అనిల్ రావిపూడి తెలిపాడు. టీం చెప్పినట్టుగానే ఈ మూవీ అందరినీ నవ్వించేలా ఉందని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.ఓ పర్ఫెక్ట్ సంక్రాంతి ఫెస్టివల్ సినిమా ఎలా ఉండాలో.. సంక్రాంతికి వస్తున్నాం సినిమా అలా ఉంటుందట. కేవలం నవ్వించడం, ఎంటర్టైన్మెంట్ ఇవ్వడమనే ఏకైక లక్ష్యంతో ఈ మూవీని తీశారట. ఆ లక్ష్య సాధనలో చిత్రయూనిట్ విజయం సాధించినట్టే అని అంటున్నారు. ఆద్యంతం నవ్వించేలా సినిమా ఉందని, వెంకీ మామ తన నలుగురు పిల్లలు, భార్య మధ్య వచ్చే సీన్లు అదిరిపోయాయని అంటున్నారు
మరీ ముఖ్యంగా వెంకీ మామ, తన కొడుకు బుల్లి రాజుతో ఉండే సీన్లు హైలెట్ అవుతాయని, ఈ మూవీకి బుల్లి రాజు షో స్టీలర్ అవుతాడని అంతా చెబుతున్నారు. మొత్తానికి ఏ లాజిక్స్, ఇదేం కథ, ఇలా ఎందుకు జరుగుతోంది? అనే అనుమానాల్ని, ఆలోచనల్ని బుర్రలోకి రానివ్వకుండా.. థియేటర్లోకి వచ్చి హాయిగా ఫ్యామిలీతో మూడు గంటల పాటు నవ్వుకునేలా అయితే ఉంటుందట. అంటే ఈ పండక్కి ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయాలంటే ఈ సంక్రాంతికి వస్తున్నాం బెస్ట్ ఆప్షన్‌లా నిలిచేలా ఉంది.
ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా థియేటర్లకు వెళ్లండి.. హాయిగా నవ్వుకునేలా ఉంటుంది.. వెంకీ మామ అందరినీ నవ్విస్తాడు.. ఐశ్వర్యా రాజేష్, మీనాక్షి, బుల్లిరాజు హాయిగా ఎంటర్టైన్ చేస్తారు. పాటలు వినడానికి, చూడటానికి కూడా చాలా బాగుంటాయి అంటూ ఇలా దాదాపు పాజిటివ్ కామెంట్లే కనిపిస్తున్నాయి. పూర్తి రివ్యూ రావాలంటే ఇంకొన్ని గంటలు ఆగాల్సిందే.