ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే.. అయితే ఇది మన కల్చర్ కాదంటున్నాయి భజరంగ్‌దళ్, వీహెచ్‌పీలు. వాలెంటైన్స్ డే కాదు.. వీర జవాన్ల దినోత్సవం అంటోంది భజరంగ్ దళ్. ప్రేమికుల దినోత్సవం జరుపుకోవడానికి వీల్లేదంటున్నాయి. ప్రేమ జంటలు కనిపిస్తే.. కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తామంటున్నాయి. పేరెంట్స్‌కు సైతం ఇన్‌ఫామ్ చేస్తామంటున్నారు భజరంగ్‌దళ్ కార్యకర్తలు.
ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14 అనగానే ప్రేమికులు బయట, పార్కుల్లో తిరగాలంటే భయపడతారు. ఎందుకంటే బజరంగ్ దళ్ కార్యకర్తలు కనిపించిన యువ జంటలకు పెళ్లి చేయిస్తారని భయం..! పార్కులు రోడ్ల వెంట జంటలు కనిపిస్తే తాళి కట్టాలని బలవంతం చేస్తారన్న భయాందోళన యువత బయటకు రావాలంటేనే భయపడుతుంటారు. అయితే తామేమి పెళ్లిళ్లు చేసే కార్యక్రమాలు పెట్టుకోలేదని ఫిబ్రవరి 14 అంటే పుల్వామా ఘటనలో అమరులైన వీర జవాన్లను స్మరించుకుని వీర జవాన్ దివస్ గా కార్యక్రమాన్ని నిర్వహించడమే తమ లక్ష్యమని బజరంగ్ దళ్ నేతలు స్పష్టం చేశారు. ప్రేమికుల రోజున బ్యాన్ వాలెంటెన్స్ డే – ప్రమోట్ వీర జవాన్ దివస్ అంటూ నినాదాన్ని వీహెచ్‌పీ, బజరంగ్ దళ్ నేతలు ఇస్తున్నారు.
తాము నిజమైన ప్రేమకు వ్యతిరేకులం కాదని, కానీ ప్రేమికుల రోజు పేరుతో వికృత చేష్టలు చేసే విష సంస్కృతికి మాత్రమే వ్యతిరేకమని బజరంగ్ దళ్ కన్వీనర్ శివరాములు అన్నారు. పార్కుల్లో పబ్బుల్లో ఏదైనా క్లబ్బుల్లో ఇతర ప్రైవేటు వాలెంటైన్స్ డే కార్యక్రమాలు పెడితే తప్పకుండా అడ్డుకుంటామని బజరంగ్ దళ్ నేతలు హెచ్చరించారు. యువతీ యువకులంతా అమరులైన వీర జవాన్లను స్మరించుకుని వీర జవాన్ దివస్‌లో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు.
దేశ రక్షణలో రాజీలేని పోరాటం చేస్తూ.. వీరమరణం పొందిన అమరులను స్మరించే దినంగా ఫిబ్రవరి 14న నిర్వహించుకోవాలని విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ సంయుక్తంగా యువతకు విజ్ఞప్తి చేసింది. ప్రేమ ముసుగులో విశృంఖల చేష్టలకు పాల్పడుతున్న యువత కళ్ళు తెరిచి, బుద్ధితో వ్యవహరించాలని అన్నారు. 2019 ఫిబ్రవరి 14వ తేదీన కాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా దగ్గర వీరమరణం పొందిన జవాన్ల ఆత్మకు శాంతి చేకూరేలా క్యాండిల్ ర్యాలీలు నిర్వహిస్తూ, ఫిబ్రవరి 14న అమరవీరుల సంస్మరణంగా నిర్వహించుకోవాలని కోరారు. భరతమాత సేవలో తరిద్దాం అంటూ పిలుపునిచ్చారు.