తిరుమల లడ్డూ వివాదం తెలుగు రాష్ట్రాలే కాదు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఏపీలోని మిగిలిన ఆలయాల్లో ప్రసాదాల తయారీ, ఉపయోగించే సరుకులపై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. ఇప్పటికే ఆయా ఆలయాల్లో తనిఖీ కూడా చేపట్టారు.. కొన్ని ఆలయాల్లో నాణ్యత లోపించినట్లు గుర్తించారు.. అక్కడ అవసరమైన మార్పులు, చేర్పులు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుని ఆలయంలో ప్రసాదం తయారీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు.
అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదంలో వినియోగించే నెయ్యిని.. విజయవాడలోని విజయ డెయిరీ నుంచి తాత్కాలికంగా కొనుగోలు చేయాలని అధికారులు నిర్ణయించారు. వాస్తవానికి అన్నవరం ఆలయానికి నెయ్యి సరఫరా చేస్తున్న టెండరుదారు రైతు డెయిరీ గడువు సెప్టెంబరు 30తో ముగిసింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఆలయాల్లో వినియోగిస్తున్న నెయ్యి నాణ్యతపై చర్చ జరుగుతోంది. అలాగే నెయ్యి కొనుగోలుపై దేవాదాయశాఖ నుంచి ఇంకా ఎలాంటి మార్గదర్శకాలు రాలేదు. అక్టోబరు 1 నుంచి నెయ్యి సరఫరాకు టెండరు ఖరారైనా సరే.. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంకా అనుమతి ఇవ్వలేదు. అలాగే స్వామివారి ప్రసాదం తయారీకి నెయ్యి నిల్వలు తక్కువగా ఉన్నాయి.. అందుకే తాత్కాలికంగా విజయ డెయిరీ నుంచి నెయ్యిని కొనుగోలు చేయాలని నిర్ణయించారు. దేవాదాయశాఖ మార్గదర్శకాలు వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు అన్నవరం ఆలయ అధికారులు తెలిపారు.
అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధిలో ప్రసాదం కోసం వినియోగించే నెయ్యి నిల్వలు తగ్గాయి. అన్నవరం ఆలయానికి ఏటా రెండు లక్షల కిలోల నెయ్యి అవసరమవుతుందనే అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న నెయ్యి మరో నాలుగు రోజులు వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈలోగా ఉత్తర్వులు రాకపోతే ప్రసాదం ఎలా తయారు చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. అందుకే తాత్కాలికంగా విజయవాడలోని విజయ డెయిరీ నుంచి నెయ్యిని కొనుగోలు చేయబోతున్నారు. నెయ్యి, ఇతర సరకుల కొనుగోలుపై దేవాదాయ శాఖ నుంచి ప్రత్యేక మార్గదర్శకాలు వచ్చే అవకాశముంది అంటున్నారు అధికారులు. దీనికి అనుగుణంగా సరకుల కొనుగోలుపై పకడ్బందీ చర్యలు తీసుకుంటామని.. ప్రసాదాల నాణ్యత విషయంలో ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెబుతున్నారు.