పచ్చటి ప్రకృతి రమణీయతకు దగ్గరగా కైలాసాన్ని తలపించే ఈ క్షేత్రం.. బ్రహ్మకైలాసంగా ప్రసిద్ది చెందింది. బ్రహ్మలింగేశ్వరుడు కొలువైన శివలింగాలపురం కొండ చుట్టూ ఒక గుండ్రటి ఆకారంలో చుట్టూ కొండలు ఉన్నాయి. ఈ కొండ పైనుంచి ఎటు చూసినా వలయాకారంలో కొండలే కనిపిస్తాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఏదో ఒక కొత్త లోకంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. మరో విధంగా చెప్పాలంటే…మనం భూమి మీద కాకుండా మరో గ్రహంలో ఉన్నామా..? అన్న భ్రమలోకి వెళతాము. అందుకే దీన్ని బ్రహ్మ కైలాసంగా భావిస్తారు.
ఎంతో ఘనమైన చారిత్రక నేపథ్యం ఉన్న ఈ ఆలయం చరిత్రలో మరుగున పడిపోయింది. ఈ పురాతన ఆలయం ఎప్పుడో శిథిలమైంది. శతాబ్దాల పరంపరలో ఎందరో రాజులు ఈ ఆలయాన్ని పునఃప్రతిష్ఠ చేస్తూ వచ్చారు. చివరగా పల్లవురాజైన నాగదేవరాజు పునఃప్రతిష్ఠ చేశారని తెలుస్తోంది. శ్రీకృష్ణ దేవరాయులు సేనాని తన సైన్యంతో వెళ్లేటప్పుడ దారితప్పి.. ఈ ప్రాంతానికి వచ్చారు. ఈ అద్బుతమైన ప్రాంతం గురించి శ్రీకృష్ణదేవరాయలుకు చెప్పడంతో ఆయన కూడా ఇక్కడికి వచ్చారు. పల్లవరాజుల అంతంతో ఆ ఆలయం ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. కాలక్రమంలో ఆలయం కూడా శిథిలమైంది. ఈ ఆలయం వద్దకు వెళ్లటానికి వీల్లేకుండా కొండపై చెట్లు మూసుకుపోయాయి.
శతాబ్దాల చరిత్ర గలిగిన బ్రహ్మయ్యలింగం క్షేత్రం పర్యాటక ప్రాంతంగా కూడా ప్రసిద్దిచెందడానికి ప్రత్యేక ఆకర్షణలు ఉన్నాయి. దాదాపుగా 2500 ఎకరాల విస్తీర్ణం కలిగిన బ్రహ్మయ్యలింగేశ్వరస్వామి చెరువు ఇక్కడ ఉంది. ఈ చెరువుకు ప్రస్తుతం 1200 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. కొండల దిగువున ఈ చెరువు ఉండటంతో అత్యద్భుతంగా కనిపిస్తుంది. ఈ చెరువులో బోటింగ్ ఏర్పాటు చేస్తే.. మంచి పర్యాటక ప్రాంతంగా మరింత అభివృద్ధి చెందుతుంది. ఈ ప్రాంతానికి సహజంగా ఉన్న ప్రక్రుతి వన్నె తెస్తాయి. బ్రహ్మ కైలాసం నుంచి చూస్తే ఇక్కడే గంటలకొద్దీ గడిపేయాలనిపించేలా ఇక్కడి వాతావరణం ఉంటుంది. అందుకే ఈ ప్రాంతాన్ని టూరిజంగా అభివృద్ధి చేయాలని పర్యాటకులు చెబుతున్నారు.