దేశవ్యాప్తంగా దసరా నవరాత్రి ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక దసరా అంటే తెలుగు రాష్ట్రాల్లో ఠక్కున గుర్తొచ్చే దేవాలయం విజయవాడ కనకదుర్గమ్మ గుడి. విజయదశమి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ రోజుకో అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తుంటారు. ఈ సందర్భంగా అమ్మవారి దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తుంటారు. గురువారం నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు మొదలు కానున్నాయి. ఇక ఉత్సవాల కోసం ఆలయ అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. గురువారం ప్రారంభమయ్యే ఉత్సవాలు పది రోజుల పాటు జరగనున్నాయి. పదిరోజుల్లో బెజవాడ కనకదుర్గమ్మను 13 నుంచి 15 లక్షల మంది భక్తులు దర్శించుకుంటారని ఆలయ అధికారుల అంచనా. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
దసరా ఉత్సవాల్లో భాగంగా రేపు ఉదయం 9 గంటల నుంచి కనకదుర్గమ్మ దర్శనం మొదలు కానుంది. తొలిరోజు కావటంతో 9 గంటల నుంచి దర్శనం ప్రారంభమవుతుంది. అయితే శుక్రవారం నుంచి తెల్లవారుజామున నాలుగు గంటలకే దర్శనం ప్రారంభమవుతుందని ఆలయ ఈవో రామారావు తెలిపారు. మహా నివేదన సమయంలో కాసేపు విరామం ఉంటుందని.. వృద్ధులు, దివ్యాంగులకు సాయంత్రం 4 నుంచి 5 వరకూ దర్శనం కల్పించనున్నట్లు తెలిపారు. వీవీఐపీలు, వీఐపీల దర్శనం ఉదయం 8 నుంచి 10 గంటల వరకూ ఉంటుందని తెలిపారు. అంతరాలయ దర్శనం రద్దుచేసినట్లు వెల్లడించారు. కనకదుర్గమ్మ దర్శనం కోసం బస్సులు, కార్ల ద్వారా కూడా రావొచ్చని ఆలయ ఈవో రామారావు తెలిపారు. భక్తుల సౌకర్యం కోసం శివాలయం దగ్గర చైర్ లిఫ్ట్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.