విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ హుండీకి భారీగా ఆదాయం సమకూరింది. భక్తులు దుర్గామల్లేశ్వర దేవస్థానంలో హుండీలలో సమర్పించిన కానుకలను ఆలయంలోని మహామండపం 6వ అంతస్తులో ఈవో ఆధ్వర్యంలో లెక్కించారు. మొత్తం 18 రోజులకుగాను అమ్మవారికి కానుకల రూపంలో రూ.2,97,47,668 నగదు సమకూరింది. అంటే రోజుకు సగటున రూ.16,62,648 చొప్పున నగదు రూపంలో కానుకలు వచ్చాయని ఆలయ అధికారులు తెలిపారు. బంగారం 410 గ్రాములు, వెండి 5 కిలోల 280 గ్రాములు భక్తులు హుండీల ద్వారా అమ్మవారికి సమర్పించారు.
దుర్గమ్మ హుండీలలో విదేశీ కరెన్సీ కూడా ఉంది. 875 ఆస్ట్రేలియా డాలర్లు, 765 అరబ్ దిర్హమ్‌లు, 681 యూఎస్ డాలర్లు, 280 థాయిలాండ్ బాత్స్, 107 సౌదీ రియాల్స్, 62 మలేషియా రింగ్గ్‌ట్స్, 50 సౌతాఫ్రికా ర్యాండ్స్, 35 కెనడా డాలర్లు, 30 యూరోలు, 20 ఇంగ్లండ్ పౌండ్లు, 17 కతార్ రియాల్స్, 9 బైంసాలు, 3.5 ఓమన్ రియాల్స్ కానుకల రూపంలో భక్తులు సమర్పించారు. ఆన్‌లైన్ ఈ.హుండీ ద్వారా మరో రూ.56,320 కానుకలు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈవో కేఎస్ రామారావు, డిప్యూటీ ఈవో, దేవదాయ శాఖ అధికారులు, ఏఈవోలు, ఆలయ సిబ్బంది, ఎస్‌పీఎఫ్ సిబ్బంది, వన్‌టౌన్ పోలీస్ సిబ్బంది ఈ హుండీ కానుకల లెక్కింపును పర్యవేక్షించారు. ఆలయ సిబ్బంది అమ్మవారి సేవాదారుల బృందం లెక్కింపులో పాల్గొన్నారు.
మరోవైపు విజయవాడ దుర్గమ్మ ఆలయంలో ఈనెల 23న సామూహిక వరలక్ష్మీ వ్రతాన్ని (ఆర్జిత, ఉచిత) నిర్వహిస్తున్నట్లు ఈవో రామారావు ప్రకటించారు. అలాగే ఈనెల 16న దుర్గమ్మను వరలక్ష్మీ దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. దుర్గమ్మ ఆలయంలో ఈనెల 18 నుంచి 20 వరకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 17న సాయంత్రం 4 గంటలకు ఉదక శాంతి.. 18న వేకువజామున 3 గంటలకు సుప్రభాత సేవ, స్నపనాభిషేకం, మూలవిరాట్‌తో పాటు ఉపాలయాల్లోని విగ్రహాలకు పవిత్ర ధారణ చేస్తారు. ఈ నెల 19న మూలమంత్ర హవనాలు, వేద పారాయణ.. 20నఉదయం 8 నుంచి 10గంటల వరకు మండపారాధన, సర్వప్రాయశ్చిత్త శాంతిపౌష్టిక హోమాలు.. ఉదయం 10.30గంటలకు పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగుస్తాయని తెలిపారు.
Amaravati News Navyandhra First Digital News Portal