విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన ఉన్న కనకదుర్గమ్మకు భారీగా ఆదాయం సమకూరింది. ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి భక్తులు హుండీలలో సమర్పించిన కానుకలను ఆలయ మహా మండపంలో లెక్కించారు. దుర్గమ్మకు 15 రోజులకుగాను రూ. 2,68,18,540 ఆదాయం నగదు రూపంలో వచ్చింది. అంటే రోజుకు సగటున రూ.17,54,569 మేరకు కానుకలు వచ్చినట్లు లెక్క. నగదులతో పాటుగా 380 గ్రాముల బంగారం, 5కిలోల 540 గ్రాముల వెండి కానుకల రూపంలో వచ్చాయి.
401 ఓమన్ రియాల్స్, 281 అమెరికా డాలర్లు, 110 యూరోలు, 70 అస్ట్రేలియా డాలర్లు, 20 ఇంగ్లండ్ పౌండ్లు, 20 ఇజ్రాయిల్ షేకల్స్, 10 యూఏఈ దీర్హమ్‌లు, 10 సింగపూర్ డాలర్లు, 10 సౌదీ రియాల్స్ , 5 కెనడా డాలర్లు, ఒక మలేషియా రిగ్గింట్‌లు కూడా కానుకల రూపంలో వచ్చాయి. ఆన్‌లైన్ ఈ హుండీ ద్వారా రూ. 54,228 వచ్చాయి. ఈ హుండీల లెక్కింపును ఈవో కేఎస్ రామారావు, వన్‌టౌన్ పోలీసులు ఎస్‌పీఎఫ్, దేవదాయశాఖ అధికారులు దగ్గరుండి పర్యవేక్షించారు.
మరోవైపు దుర్గమ్మ ఆలయానికి భక్తులు రద్దీ పెరుగుతోంది.. ముఖ్యంగా వీకెండ్‌లో ఎక్కువమంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం వస్తున్నారు. దీనికి తోడు ఆషాడమాసం కావడంతో దుర్గమ్మ ఆలయంలో మరింత రద్దీ కనిపిస్తోంది. ఇంద్రకీలాద్రిపై భక్తుల సంఖ్య పెరగడంతో అమ్మవారి హుండీకి భారీగా ఆదాయం సమకూరుతోంది. అంతేకాదు ఆదివారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరిన సందర్భాలు ఉన్నాయి. అందుకే ఇటీవల కాలంలో 15, 20 రోజులకు ఒకసారి హుండీలో కానుకల్ని లెక్కిస్తున్నారు.
అంతేకాదు వీకెండ్‌తో పాటుగా ఇతర పండుగల సమయంలో వాహనాలను ఇంద్రకీలాద్రిపైకి అనుమతించడం లేదు. భక్తుల రద్దీ పెరగడంతో వాహనాలను కొండ కిందే పార్క్ చేసి రావాలని దుర్గమ్మ ఆలయ అధికారులు సూచిస్తున్నారు. ఆలయం బస్సుల్లో కొండపైకి చేరుకోవాలని భక్తులకు సూచనలు చేశారు.. రద్దీ సమయంలో వాహనాలు ఇంద్రకీలాద్రిపైకి రావడంతో పార్కింగ్ సమస్యలు ఎదురవుతున్నాయని అధికారులు చెబుతున్నారు.. అలాగే భక్తులు ఇబ్బందిపడుతున్నారని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.