విజయవాడ లోకో పైలెట్‌ను ఆ ఒక్క కారణంగానే చంపేశా.. షాకింగ్ విషయాలు చెప్పిన బీహార్ నిందితుడు

విజయవాడ రైల్వే స్టేషన్‌లో లోకోల పైలెట్ హత్య మిస్టరీ వీడింది.. ఎబినేజర్‌ను హత్య చేసిన నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడ్ని బీహార్‌కు చెందిన దేవ్ కుమార్‌గా గుర్తించారు. విజయవాడలో లోకో పైలట్ ఎబినేజర్‌ను విధుల్లో ఉండగా.. దేవ్‌కుమార్ ఇనుప రాడ్డుతో ఆయన తలపై బలంగా కొట్టారు. ఆయన తలకు తీవ్ర గాయం కావడంతో విజయవాడలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఎబినేజర్ కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు.. ఐదు టీమ్‌లుగా ఏర్పడి సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని నిందితుడి కోసం గాలించారు.

ఈ క్రమంలో అప్పి యార్డు సమీపంలో శనివారం ఉదయం 7 గంటల సమయంలో గాలింపు చేపడతుండగా నిందితుడు పోలీసులకు కనిపించాడు. వెంటనే అతడ్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా.. తన పేరు దేవ్ కుమార్‌, బిహార్‌లోని షైనీ దర్ఫారీ అని చెప్పాడు. అతడు జీవనాధారం కోసం విజయవాడ రాగా.. చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. దేవ్‌కుమార్‌ పనిచేసి సంపాదించే డబ్బులు సరిపోక రాత్రిపూట ఒంటరిగా కనిపించిన వారిని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఒకవేళ వాళ్లు ఎదురు తిరిగితే దాడి చేసేవాడు.

విజయవాడ రైల్వే స్టేషన్ ఎఫ్ క్యాబిన్ దగ్గర ఈ నెల 10న లోకో పైలట్ ఎబినేజర్ కనిపించాడు.. దేవ్‌కుమార్ ఆయన్ను డబ్బులు డిమాండ్‌ చేశాడు. తన దగ్గర డబ్బులు లేవని చెప్పాడు.. ఇక్కడి నుంచి వెళ్లిపొమ్మని ఎబినేజర్ చెప్పాడు. ఆ కోపంలో దేవ్‌కుమార్ ఇనుప రాడ్డుతో లోకో పైలట్‌ తలపై కొట్టి.. జేబులో ఉన్న రూ.750 తీసుకున్నాడు. ఎబినేజర్‌పై దాడి చేసేందుకు వినియోగించిన ఇనుప రాడ్‌ను పక్కనే ఉన్న పొదల్లో పడేసి అక్కడి నుంచి పారిపోయాడు. ఆ తర్వాత మరికొందరిని నిందితుడు డబ్బుల కోసం బెదిరించినట్లు తేల్చారు పోలీసులు.. దేవ్‌ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నామని.. ఆయన్ను ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు. చెడు వ్యసనాలకు బానిసై ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాడు దేవ్ కుమార్. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

About amaravatinews

Check Also

ఏపీలో విద్యార్థులకు శుభవార్త.. అకౌంట్‌లలోకి డబ్బులు జమ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. గత ఐదేళ్లుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *