ఆంద్రప్రదేశ్‌లో పర్యాటక ప్రదేశాలపై మరింత ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. ఈ మేరకు ఆంధ్రా ఊటీగా పిలిచే అరకులో పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు పద్మాపురం ఉద్యానంలో హాట్ బెలూన్‌ను సందర్శకుల కోసం అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ మేరకు ట్రయల్‌రన్‌ని నిర్వహించారు. అరకు లోయకి ఏటా సుమారు మూడు లక్షల మంది వరకు పర్యాటకులు వస్తుంటారన్నారు పాడేరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి అభిషేక్. అందుకే హాట్‌బెలూన్ అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు తెలిపారు. హాట్ బెలూన్ పర్ాయటకులను సుమారు 300 అడుగుల మేర పైకి తీసుకువెళ్లి మళ్లీ కిందకి దించుతుందన్నారు.
కొత్తవలస వ్యవసాయ ప్రదర్శన క్షేత్రంలో త్వరలోనే పారా గ్లైడింగ్‌ని ఏర్పాటు చేస్తామని.. పద్మాపురం ఉద్యానంలో కొత్త ఐలవ్ అరకు హోర్డింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే పద్మాపురం ఉద్యానాన్ని రాత్రి 10 గంటల వరకు సందర్శకులు వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు అభిషేక్ తెలిపారు. దీని కోసం ఫ్లడ్ లైట్లు, రోప్ లైట్లు, హెడ్ లైట్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. ఉద్యానంలో జపనీస్ ఆర్చ్, వివిధ గార్డెన్‌లలో నేమింగ్ బోర్డుల ఏర్పాటు.. కాలి మార్గాన్ని అందుబాటులోకి తెస్తామన్నారు. కొత్తపల్లి జలపాతం దగ్గర లేజర్ లైటింగ్, కాలిబాట.. కొత్తపల్లి, కొత్తవలస జలపాతాలను చాపరాయిలా మరింత అభివృద్ధి చేస్తామన్నారు అభిషేక్.
మరోవైపు పద్మాపురం గార్డెన్‌ను పర్యాటకులను ఆకట్టుకునే విధంగా ఆధునికీకరిస్తామన్నారు అభిషేక్. ఈ గార్డెన్‌ను చెన్నై సెంటినరీ పార్కు, బెంగళూరు, ఊటీలలో ఉండేలా బొటానికల్ గార్డెన్ ఏర్పాటు చేస్తామన్నారు. పద్మాపురం గార్డెన్‌లో ఎన్నో రకాల అరుదైన మొక్కలు ఉన్నాయని.. వీటన్నింటి ప్రాముఖ్యతను వివరించే విధంగా బోర్డులను ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే కొత్తపల్లి జలపాతాన్ని కలర్‌ఫుల్ లైటింగ్‌లో చూసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.
అరకు ప్రాంతానికి నవంబర్ నెల నుంచి పర్యాటకుల తాకిడి పెరుగుతుంది.. అలా ఫిబ్రవరి నెలాఖరు వరకు కొనసాగుతుంది. అందుకే పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు ఇప్పుడు హాట్ బెలూన్, పారా గ్లైడింగ్ ఏర్పాటు చేశారు ప్రభుత్వ అధికారులు.