MLC Election: ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు అయింది. ఈ ఎమ్మెల్సీ ఉపఎన్నిక నిర్వహించేందుకు జారీ చేసిన నోటిఫికేషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల మేరకు విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత ఎమ్మె్ల్సీ ఇందుకూరి రఘురాజు.. తన పదవిలో కొనసాగవచ్చని కోర్టు తేల్చి చెప్పిన నేపథ్యంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.
ఇక ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుపై మండలి ఛైర్మన్ అనర్హత వేటు వేశారు. మండలి ఛైర్మన్ నిర్ణయాన్ని రఘురాజు హైకోర్టులో సవాల్ చేశారు. మండలి ఛైర్మన్ నిర్ణయాన్ని తప్పుబట్టిన ఉన్నత న్యాయస్థానం.. అనర్హత వేటు చెల్లదని తీర్పు ఇచ్చింది. అతను ఎమ్మెల్సీగా కొనసాగొచ్చని తీర్పు ఇచ్చింది. దీంతో ఉపఎన్నిక నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్టు ఈసీ ప్రకటించింది.
గతంలో వైసీపీ నుంచి విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలిచిన ఇందుకూరి రఘురాజు.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీడీపీకి దగ్గరయ్యారు. దీంతో ఆయనపై సొంత పార్టీ నేతలు ఫిర్యాదు చేయడంతో మండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు.. ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుపై అనర్హత వేటు వేశారు. దీంతో విజయనగరం ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయినట్లుగా ఎన్నికల సంఘం నోటిఫై చేసింది. ఈ క్రమంలోనే మండలి ఛైర్మన్ తనపై అనర్హత వేటు వేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రఘురాజు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. రఘురాజుపై అనర్హత వేటు చెల్లదని తాజాగా తేల్చిచెప్పింది.