ఏపీవాసులకు అలర్ట్.. రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురవనున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని.. ఈ అల్పపీడనం రెండు రోజుల్లో పశ్చిమ దిశగా నెమ్మదిగా తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు కదిలే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ అల్పపీడనం ప్రభావంతో వచ్చే మూడు రోజులు రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లోని కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అలాగే మిగతా జిల్లాలలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
మరోవైపు అల్పపీడనం ప్రభావంతో మంగళవారం పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, వైఎస్ఆర్ , అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లోని కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
ఇక బుధవారం అల్లూరి సీతారామరాజు, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాలలో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వానలు పడతాయని తెలిపింది. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, గుంటూరు, ఎన్టీఆర్, బాపట్ల, ప్రకాశం, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలలో తేలికపాటి వానలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.