ఏలూరు జిల్లాలో వైఎస్సార్‌సీపీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జిల్లాకు చెందిన ముఖ్య నేతలు వరుసగా పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. మాజీ మంత్రి ఆళ్ల నాని, ఏలూరు కార్పొరేషన్ ఛైర్మన్, కార్పొరేటర్లు వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేశారు. వీరిలో ఏలూరు కార్పొరేషన్ ఛైర్మన్, కార్పొరేటర్లు టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా వైఎస్సార్‌సీపీకి మరో ఎదురు దెబ్బ తగిలింది.. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జడ్పీ ఛైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ, ఆమె భర్త వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు ప్రసాదరావు పార్టీకి రాజీనామా చేశారు. దంపతులిద్దరు తమ రాజీనామా లేఖలను పార్టీ అధినేత జగన్ మోహన్‌రెడ్డికి పంపించారు.. తాము జనసేన పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు.
గత పదమూడేళ్లుగా వైఎస్సార్‌సీపీ పని చేశానని.. కొన్ని వ్యక్తిగత కారణాలతో పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశానన్నారు జెడ్పీ ఛైర్ పర్సన్ పద్మశ్రీ . డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీల కోసం బాగా పని చేస్తున్నారని.. ఆయన నేతృత్వంలో జిల్లా పరిషత్తు ద్వారా ప్రజలకు సేవలందిస్తామన్నారు. జిల్లాలో గ్రామాల అభివృద్ధికి ఇదొక మంచి అవకాశమని.. అందుకే తాము త్వరలో జనసేన పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతోనే వైఎస్సార్‌సీపీ పదవికి, సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ఘంటా ప్రసాదరావు తెలిపారు.