Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన డొనాల్డ్ ట్రంప్.. తన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కేబినెట్ పదవుల్లో కీలక వ్యక్తులకు అవకాశం కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎలాన్ మస్క్‌తోపాటు భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామికి ఇటీవలె పలు కీలక పదవులను కట్టబెట్టారు. తాజాగా తులసి గబ్బర్డ్‌ను అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా నియమించారు. ఇక తులసి గబ్బర్డ్ మాజీ డెమోక్రట్ కావడం గమనార్హం. అయితే తులసి గబ్బర్డ్ హిందూ కావడంతో ఆమె ఎంపిక ప్రస్తుతం ప్రాధాన్యం సంతరించుకుంది. భారతీయురాలు కాని తులసి గబ్బర్డ్.. హిందువు కావడం విశేషం.
తులసి గబ్బర్డ్‌ను నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా బుధవారం నియమించిన డొనాల్డ్ ట్రంప్.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె ఒక గర్వించదగిన రిపబ్లికన్ అని అభివర్ణించారు. అమెరికా ఇంటెలిజెన్స్ రంగంలోకి నిర్భయమైన స్ఫూర్తిని తులసి గబ్బర్డ్ తీసుకురాగలరని ట్రంప్ ఆకాంక్షించారు. డెమొక్రాట్ ప్రెసిడెన్షియల్ నామినేషన్ కోసం మాజీ అభ్యర్థిగా ఆమెకు రెండు పార్టీల్లో చాలా మద్దతు ఉందని పేర్కొన్నారు. తులసి గబ్బర్డ్ ఇప్పుడు గర్వించదగిన రిపబ్లికన్ అని.. ఇంటెలిజెన్స్ విభాగంలో రాజ్యాంగ హక్కులను సమర్థిస్తూ శాంతిని కాపాడే నిర్భయమైన స్ఫూర్తిని తీసుకువస్తారని తెలుసని చెప్పారు. తులసి గబ్బర్డ్ మనందరినీ గర్వించేలా చేస్తారని ట్రంప్ తెలిపారు.
ఎవరీ తులసి గబ్బర్డ్ (Tulsi Gabbard )?
43 ఏళ్ల తులసి గబ్బర్డ్ దాదాపు 20 ఏళ్ల పాటు అమెరికా ఆర్మీ అయిన నేషనల్ గార్డ్‌లో సేవలు అందించారు. ఇరాక్, కువైట్ వంటి దేశాల్లోనూ పని చేశారు. తులసి గబ్బర్డ్‌కు ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేసిన అనుభవం లేకపోవడం గమనార్హం. ఆమె హోంల్యాండ్ సెక్యూరిటీ కమిటీలో పనిచేశారు. 2013 నుంచి 2021 వరకు తులసి గబ్బర్డ్ హవాయి పార్లమెంటు సభ్యురాలిగా ఉన్నారు. అంతేకాకుండా తులసి గబ్బర్డ్ తొలి హిందూ అమెరికా కాంగ్రెస్ మహిళగా రికార్డుల్లోకి ఎక్కారు.