ఏలూరు జిల్లా పోలవరానికి చెందిన యువ రైతు పోషకాల పండు సాగుతో భారీ లాభాలు అందుకుంటున్నారు. ముందు ఒక మొక్కను తెచ్చి నాటి చూశారు.. ఆ తర్వాత ఆ పండు విలువ తెలిసి సాగు ప్రారంభించారు. మంచి సక్సెస్ సాధించి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. ఈ పండు చూడటానికి నారింజ రంగు.. ఆగాకర వంటి ఆకారంలో కనిపిస్తుంది. ఈ కాయను కోసి చూస్తే.. పసుపు రంగు గుజ్జు మధ్య ఎర్రటి రసంలో గింజలు ఉంటాయి. ఆ పండు పేరు గ్యాక్ (గ్రేట్ అమెరికన్ కంట్రీ) ఫ్రూట్.
ఏలూరు జిల్లా పోలవరం మండలం మామిడిగొందికి చెందిన బొరగం వెంకట్.. తన ఇంటి ఆవరణలో ఈ గ్యాక్ ఫ్రూట్ మొక్కను తీసుకొచ్చి సాగు చేశారు. అప్పటి నుంచి కొత్త పంటలపై ఆసక్తి పెరగడంతో.. వెంకట్ గతేడాది నవంబరులో మొక్కలను కేరళ నుంచి తెప్పించి, నాటారు. మే నుంచి దిగుబడి మొదలవ్వగా.. పండును రసం చేసుకొని తీసుకుంటారని చెప్పారు వెంకట్. ఈ గ్యాక్ ఫ్రూట్‌ను ఇతర రాష్ట్రాల్లో కిలో గరిష్ఠంగా రూ. 1500 లకు విక్రయిస్తుండగా.. ఇక్కడ మాత్రం ప్రస్తుతానికి రూ. 500లకు అమ్ముతున్నారు. అధిక పోషకాలున్న ఈ పండుకు స్వర్గ ఫలం అని కూడా పిలుస్తుంటారు. వెంకట్ ప్రయోగం విజయవంతం కావడంతో.. మరికొందరు రైతులు కూడా ఈ పంటను సాగు చేయాలనే ఆలోచనలో ఉన్నారని చెబుతున్నారు.
ఉమ్మడి పశ్చిమ జిల్లాలో ఏలూరు, దెందులూరు వ్యవసాయ మార్కెట్ల నుంచి నిమ్మకాయలు ఎగుమతి అవుతున్నాయి. దేశంలోని కర్ణాటక, ఢిల్లీ, పశ్చిమబెంగాల్, బిహార్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. ఏడాదికి ఏలూరు యార్డు నుంచి సుమారు 1500 నుంచి 2 వేల లారీలు, దెందులూరు యార్డు నుంచి 500 లారీల నిమ్మకాయలు ఎగుమతి చేస్తారు. మార్కెట్ కమిటీలకు వీటి ద్వారా ఏటా రూ.కోట్లలో ఆదాయం కూడా వస్తుంది. అయితే ఏలూరు, దెందులూరు మార్కెట్ కమిటీల్లో ఈనామ్ అమలుకు ఆన్‌లైన్ బిడ్డింగ్ ధరలు ప్రదర్శించేందుకు ఎలక్ట్రానిక్ బోర్డులు ఏర్పాటు చేశారు. కానీ అవి పనిచేయడం లేదు.
నేటికీ రైతులు మార్కెట్ యార్డులకు తీసుకొచ్చే నిమ్మకాయల క్రయవిక్రయాలు వ్యాపారుల కనుసన్నల్లోనే జరుగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. మార్కెట్ యార్డుల్లో వారు చెప్పిందే ధరగా మారింది.. యార్డుల్లో నేటికీ పాత పద్ధతుల్లోనే వేలం పాటలు జరుగుతున్నాయి. అయితే అదే ఈనామ్ అమలు జరిగితే దేశంలోని వ్యాపారులంతా ఆన్‌లైన్లో బిడ్డింగ్ వేస్తారని చెబుతున్నారు. అప్పుడు రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందన్నారు. ఈఆ న్‌లైన్ బిడ్డింగ్‌తో రైతులకు మంచి ధర లభించడంతో పాటు మార్కెట్ కమిటీలకు మంచి ఆదాయం వస్తుందంటున్నారు.