ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీలో మార్పులు, చేర్పులు మొదలుపెట్టారు. అన్ని జిల్లాలకు కొత్తగా అధ్యక్షుల్ని నియమిస్తున్నారు.. తాజాగా మరో మూడు జిల్లాలకు అధ్యక్షుల్ని ప్రకటించారు. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల వైఎస్సార్‌సీపీ అధ్యక్షులను మార్చారు. విశాఖపట్నం జిల్లాకు మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్, అనకాపల్లికి మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, అల్లూరి సీతారామరాజు జిల్లాకు పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజును అధ్యక్షులుగా నియమించారు.
2024 ఎన్నికల ముందు పంచకర్ల రమేష్‌బాబు పార్టీని వీడటంతో.. విశాఖపట్నం జిల్లాకు కోలా గురువులును పార్టీ అధ్యక్షుడిగా నియమించారు.. ఇప్పుడు ఆయన్ను తప్పించారు. అనకాపల్లి జిల్లా అధ్యక్ష బాధ్యతను గతేడాది కరణం ధర్మశ్రీకి అప్పగించి.. ఆ తర్వాత బొడ్డేడ ప్రసాద్‌ను నియమించారు. తాజాగా ప్రసాద్‌ను తప్పించి ముత్యాలనాయుడికి బాధ్యతలు ఇచ్చారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అధ్యక్షురాలిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిని తప్పించి.. ఆ స్థానంలో ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజును నియమించారు. అలాగే విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ బాధ్యతను మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్‌కు అప్పగించారు. ఇటీవల ఎన్నికల్లో ఆ నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ఆడారి ఆనంద్ పోటీ చేయగా.. ఆ తర్వాత పార్టీకి దూరంగా ఉంటున్నారు. దీంతో ఆ బాధ్యతల్ని మళ్ల విజయప్రసాద్‌కు ఇచ్చారు.
వైఎస్సార్‌సీపీ రాజకీయ వ్యవహారాల సలహా కమిటీ సభ్యులుగా మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్, మాజీ ఎమ్మెల్యే కె.భాగ్యలక్ష్మిని నియమించారు అధినేత వైఎస్ జగన్. ఇప్పటివరకూ అల్లూరి జిల్లా అధ్యక్షురాలిగా ఉన్న భాగ్యలక్ష్మికి పార్టీ ఎస్టీ విభాగం అధ్యక్ష బాధ్యతలను కూడా అప్పగించారు. బాపట్ల లోక్‌సభ నియోజకవర్గ పరిశీలకుడిగా నందిగం సురేష్.. ఆ జిల్లా అధ్యక్షుడిగా మాజీ మంత్రి మేరుగు నాగార్జునను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, ఎన్టీఆర్, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు కూడా అధ్యక్షుల్ని నియమించారు. అలాగే ఇటీవల వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగాలకు కూడా అధినేత వైఎస్ జగన్ అధ్యక్షుల్ని నియమించిన సంగతి తెలిసిందే.