విజయవాడలో ఉన్న శ్రీ శృంగేరి శారదా పీఠాన్ని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సందర్శించారు. ఈ మేరకు పీఠంలోని శ్రీ విధుశేఖర భారతీ స్వామీజీని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.. అక్కడ జగన్ దాదాపు గంటసేపు గడిపారు. స్వామిజీతో చర్చించిన అంశాలను వెల్లడించలేదు. ఈ సమావేశం ముగిసిన వెంటనే నేరుగా తాడేపల్లిలోని నివాసానికి జగన్ వెళ్లిపోయారు. జగన్‌తో వెంట వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ భరత్, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఉన్నారు. జగన్ రాకతో కార్యకర్తలు అక్కడికి తరలి వచ్చారు.
వైఎస్ జగన్ శ్రీ శృంగేరి శారదా పీఠానికి వెళ్లి శ్రీ విధుశేఖర భారతీ స్వామీజీని కలవడం ఆసక్తికరంగా మారింది. పీఠంలో దాదాపుగా గంటసేపు ఉండటం చర్చనీయాంశమైంది. స్వామీజీతో ఏ, ఏ అంశాలపై చర్చించారని హాట్ టాపిక్ అయ్యింది. అయితే స్వామిజీ ఆశీస్సులు తీసుకోవడం కోసమే వైఎస్ జగన్ వెళ్లారని.. ఎలాంటి ప్రాధాన్యత లేదని వైఎస్సార్‌సీపీ వర్గాలు చెబుతున్నాయి. వైఎస్ జగన్ ప్రతిపక్షనేతగా, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కువగా విశాఖపట్నంలో ఉన్న శ్రీ శారదా పీఠాన్ని సంందర్శించేవారు. పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి, శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామిల ఆశీర్వాదం తీసుకున్నారు. ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడికి ఇప్పటి వరకు వెళ్లలేదు.ఇదిలా ఉంటే వైఎస్ జగన్ శారదా పీఠానికి వచ్చే సమయంలో కొంతమంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు అక్కడికి వచ్చారు. వారిలో కొందరు ఓ మృతదేహంతో హల్చల్ చేశారు. విజయవాడకు చెందిన నక్కా వెంకట శివనాగేశ్వరరావు అనే వ్యక్తి రోడ్డుప్రమాదంలో తీవ్రగాయాలు కాగా.. ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలుకోల్పోయారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం సరిగా అందక చనిపోయినట్లు బాధితులు ఆరోపించారు. ఈ విషయం జగన్ దృష్టికి తీసుకెళ్లాలని కుటుంబీకులు మృతదేహంతో పీఠం దగ్గరకు వచ్చారు. అయితే పోలీసులు వారికి సర్దిచెప్పి అక్కడి నుంచి వెనక్కి పంపారు.