మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ వైఎస్ సునీతా రెడ్డి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి వచ్చారు. ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డితో కలిసి సీఎంవో కార్యాలయానికి వెళ్లారు.. అక్కడ వైఎస్ వివేకా హత్య కేసు విచారణ పురోగతిపై అధికారులతో చర్చించినట్లు తెలుస్తోంది. అంతేకాదు సునీత ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా కలిసినట్లు తెలుస్తోంది. గతవారం సునీత కడపలో ఎస్పీని కూడా కలిశారు.. ఇప్పుడు తాజాగా అసెంబ్లీకి రావడం ఆసక్తికరంగా మారింది.
రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి జైలు అధికారులకు రాసిన లేఖపై స్పందించాలని కోరినట్లు తెలుస్తోంది. అంతేకాదు సుప్రీం కోర్టులో వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుకు సంబంధించి.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అఫిడవిట్ వేయడంతో పాటు.. ఈ కేసు దర్యాప్తులో పురోగతిపై ఆరా తీసినట్లు సమాచారం. వైఎస్ సునీత ముందుగా హోంమంత్రి అనితతో మాట్లాడిన అనంతరం సీఎంవో కార్యాలయానికి వెళ్లి అధికారులతో భేటీ అయ్యారని చెబుతున్నారు. తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారట సునీత రెడ్డి.
వైఎస్ వివేకా హత్య కేసులో మరికొన్ని పరిణామాలు మొదలయ్యాయి. కడప ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుపై సుప్రీంలో విచారణ ప్రారంభమవుతోంది. వివేకా కేసులో అవినాష్‌కు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని సునీత సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇటు వివేకా పీఏ కృష్ణారెడ్డి కోర్టులో చేసిన ఫిర్యాదుతో సునీత రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌పై నమోదైన కేసులో కూడా విచారణ వేగవంతం అయ్యింది. ఈ మేరకు కృష్ణారెడ్డి వాంగ్మూలాన్ని కడప పోలీసులు రికార్డు చేసిన సంగతి తెలిసిందే. ఇలా వైఎస్ వివేకా హత్య కేసులో వరుసగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.