ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి నాలుగు నెలలు దాటిపోయింది. మొన్నటి వరకూ అధికార పక్షం మీద విమర్శలు చేయడానికి కాస్త ఆలోచించిన వైసీపీ నేతలు.. తాజాగా ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. వాగ్భాణాలు సంధిస్తున్నారు. సాధారణంగా అధికారంలోకి వచ్చిన తొలు ఆరు నెలలు పాటు.. నూతన ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ అంటుంటారు. ఆ సమయంలో కొత్త ప్రభుత్వం మీద విపక్షాలు పెద్దగా ఆరోపణలు చేయవు. ప్రభుత్వం కాస్త కుదురుకోవడానికి సమయం ఇస్తాయి. అయితే టీడీపీ కూటమి సర్కారు తీరు కారణంగా అంత సమయం కూడా ఇవ్వమంటోంది వైసీపీ. చంద్రబాబు ప్రభుత్వ విధానాలను అప్పుడే బలంగా ఎండగడుతోంది. నేతలు సైతం ఒక్కొక్కరుగా బయటకు వచ్చి ప్రభుత్వం తీరును ఎండగడుతున్నారు.
ఈ క్రమంలోనే హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ తెర మీదకు వచ్చారు. వైసీపీ నేతల్లో దూకుడైన నేతగా పేరున్న గోరంట్ల మాధవ్.. ఎన్నికల ఫలితాల తర్వాత కాస్త సైలెంట్‌గా ఉన్నారు. అయితే సోమవారం మీడియా సమావేశం నిర్వహించిన గోరంట్ల మాధవ్.. చంద్రబాబుపైనా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైనా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం భయానక వాతావరణ నెలకొందని గోరంట్ల మాధవ్ ఆరోపించారు. ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ అంటూ ప్రజలను నమ్మించిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ హామీల అమలును పట్టించుకోవడం లేదన్నారు.