తిరుమల సిఫార్సు లేఖల విషయంలో గుంటూరు అరండల్‌పేటలో తనపై నమోదైన కేసు, వస్తున్న ఆరోపణలపై వైసీపీ ఎమ్మెల్సీ భరత్ స్పందించారు. తిరుమల శ్రీవారి దర్శనం, పూజ టికెట్లను అమ్ముకునేంత దౌర్భాగ్యం తనకు పట్టలేదని భరత్ అన్నారు.. తన తండ్రి ఓ ఐఏఎస్ అధికారి అని చెప్పిన భరత్ .. తాను ఒక బ్యూరోక్రట్ ఫ్యామిలీ నుంచి వచ్చానని అన్నారు. ఉన్నతమైన విలువలతో తమ కుటుంబం బతుకుతోందని అన్నారు. టీడీపీ నేత చిట్టిబాబు చెప్తున్నట్లుగా తనకు మల్లికార్జున్ అనే పీఆర్వో లేడన్న ఎమ్మెల్సీ భరత్.. ఆ పేరుతో ఎవరూ తనకు పరిచయం కూడా లేదన్నారు.
కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబుపై పోటీ చేయటంతో పాటుగా.. అక్కడ ఆయనను ఎదుర్కొంటూ రాజకీయాల్లో నిలబడుతున్నానన్న కక్షతోనే తనపై కేసులు నమోదు చేస్తున్నారని భరత్ ఆరోపించారు. ఇక తనను, తన కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్సీ భరత్ స్పష్టం చేశారు. తనపై ఫిర్యాదు చేసిన వారెవరు? పోలీసులు కేసులో రాసిన వాళ్లు ఎవరనే విషయాలను అన్నీ ఆరా తీస్తానన్న భరత్.. పూర్తి వివరాలతో త్వరలోనే మళ్లీ మీడియా ముందుకు వస్తానని స్పష్టం చేశారు.
మరోవైపు తిరుమల శ్రీవారి తోమాల సేవ పేరిట సిఫార్సు లేఖలను విక్రయించారనే ఆరోపణలపై భరత్ మీద కేసు నమోదైంది. గుంటూరు వాసుల నుంచి తోమాల సేవ సిఫార్సు లేఖలకు రూ.3 లక్షల చొప్పున ఎమ్మెల్సీ భరత్ వసూలు చేశారంటూ టీడీపీ నేత చిట్టిబాబు ఆరోపించారు. ఈ మేరకు గుంటూరులోని అరండల్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిట్టిబాబు ఫిర్యాదుతో అరండల్‌పేట పోలీసులు ఎమ్మెల్సీ భరత్‌పై కేసు నమోదు చేశారు. భరత్ పీఆర్వో మల్లికార్జునపైనా కూడా కేసు నమోదైంది. అయితే మల్లికార్జున అనే పీఆర్వో తనకు లేరని భరత్ చెప్తున్నారు.
2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీద వైసీపీ తరుపున భరత్ పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు చేతిలో 48 వేల ఓట్ల తేడాతో కేఆర్జే భరత్ ఓడిపోయారు. అయితే కుప్పంలో చంద్రబాబుకు బలమైన పోటీ ఇవ్వాలనే ఉద్దేశంతో భరత్‌ను రాజకీయంగా ప్రోత్సాహిస్తున్నారు వైఎస్ జగన్. ఈ క్రమంలోనే 2021లో స్థానిక సంస్థల కోటాలో కేఆర్జే భరత్‌ను వైసీపీ ఎమ్మెల్సీని చేసింది. ఈ పదవీ కాలం 2027 డిసెంబర్ వరకూ కొనసాగనుంది.