తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. దర్శనం, గదులు బుక్ చేస్కోండి

తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యగమనిక.. డిసెంబర్ నెలకు సంబంధించిన దర్శనం, గదులు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలని టీటీడీ భక్తులకు సూచించింది. ఇవాళ ఉదయం 10 గంటలకు డిసెంబర్ నెల కోటా.. అంగప్రదక్షిణం టికెట్లను టీటీడీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుంది. అలాగే ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించి టీటీడీ డిసెంబరు నెల ఆన్ లైన్ కోటాను విడుదల చేస్తుంది. అలాగే ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు.. వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా.. డిసెంబర్ నెల ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను టీటీడీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతుంది.

అలాగే డిసెంబరు నెల‌కు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన రూ.300 టికెట్లను ఈ నెల 24 (మంగళవారం) ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తుంది. అలాగే తిరుమల, తిరుపతిలో వసతి గదులు డిసెంబరు నెల గదుల కోటాను మంగళవారం (సెప్టెంబర్ 24న) మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది టీటీడీ. ఈ నెల 27న తిరుమ‌ల – తిరుప‌తి శ్రీవారి సేవ కోటాను ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు. అలాగే న‌వ‌నీత సేవను అదే రోజు (మంగళవారం) మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు.. ప‌ర‌కామ‌ణి సేవ మ‌ధ్యాహ్నం 1 గంట‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది టీటీడీ. భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకోవాల‌ని టీటీడీ సూచించింది.

మరోవైపు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.. ఇవాళ తిరుమల శ్రీవారి ఆలయంలో శాంతి హోమం నిర్వహిస్తోంది టీటీడీ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల శ్రేయస్సుతో పాటు లడ్డూ ప్రసాదాల పవిత్రత, దైవత్వాన్ని పునరుద్ధరింపజేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ⁠ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా శ్రీవారి నైవేద్యంలో వాడే నెయ్యిలో కల్తీ జరిగిందని గుర్తించామన్నారు టీటీడీ ఈవో జే శ్యామలరావు. ⁠సర్వపాప పరిహారార్థం, భక్తుల శ్రేయస్సును ఆకాంక్షిస్తూ ఇవాళ ఉదయం 6 నుంచి 10 గంటల వరకు తిరుమలలోని బంగారు భావిష్యంత ఉన్న యాగశాలలో శాంతి హోమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఇప్పటికే ఆగస్టు 15 నుంచి 17వ తేదీ వరకు టీటీడీ మూడు రోజులపాటు పవిత్రోత్సవాలను ఆకమోక్తంగా నిర్వహించిందని టీటీడీ ఈవో గుర్తు చేశారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం, నైవేద్యంలో కల్తీ పదార్థాలు ఉన్నాయని గుర్తించామని.. అందుకు పరిహరణగా శాంతి హోమం నిర్వహించాలని ఆగమ సలహా మండలి నిర్ణయించినట్లు తెలిపారు. తిరుమల శ్రీవారి ⁠లడ్డూల రుచిని మెరుగుపరిచేందుకు టీటీడీ చేపట్టిన చర్యలను వివరిస్తూ.. టీటీడీ ప్రస్తుతం ఆవు నెయ్యి కొనుగోలు విధానాన్ని పూర్తిగా మార్చివేసింది అన్నారు. స్వచ్ఛమైన ఆవు నెయ్యిని ఎంతో పారదర్శకంగా కొనుగోలు చేస్తున్నామని ఈవో తెలిపారు. తాము చేపట్టిన ఈ సంస్కరణలతో ఇప్పుడు లడ్డూ ప్రసాదం రుచి ఎంతో మెరుగుపడిందని.. భక్తులు కూడా ఎనలేని సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని ఈవో శ్యామలరావు తెలిపారు.

About amaravatinews

Check Also

చిన్న విషయానికే ఇంతలా శిక్ష వేయాలా..? మూగ జీవులపై ప్రతాపం.. టెంపుల్ సిటీలో కలకలం

టెంపుల్ సిటీ తిరుపతిలో శునకాలపై వరుస దాడుల వ్యవహారం ఆందోళన కలిగిస్తోంది. కొందరు శునకాలపై కర్కశత్వాన్ని ప్రదర్శిస్తున్న తీరు భయపెడుతోంది. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *