శ్రీకాకుళం: చిన్న చేప ముల్లు మత్స్యకారుడి ప్రాణాలు తీసింది.. ఇలా కూడా జరుగుతుందా!

చిన్న చేప ముల్లుకు ఓ నిండు ప్రాణం బలైంది. కుటుంబ పోషణ కోసం పొరుగు రాష్ట్రానికి వెళితే.. ఊహించని ఘటనతో ప్రాణాలే పోయాయి.. ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదాన్ని నింపింది. శ్రీకాకుళం రూరల్‌ మండలం నర్సయ్యపేటకు చెందిన కొమర పోలీసు అనే మత్స్యకారుడికి రేవతి అనే మహిళతో వివాహమైంది.. ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసుకు స్థానికంగా ఉపాధి లేకుండా పోయింది.. దీంతో ఉపాధి కోసం తన తండ్రి అవతారంతో కలిసి గత నెల 28న కర్ణాటక రాష్ట్రం మంగుళూరు వలస వెళ్లాడు. అక్కడ పోలీసుకు చేపల వేట పని దొరకగా.. తండ్రి అవతారానికి ఒడ్డున వలలు అల్లుకునే పని దొరికింది.

ఇటీవల సముద్రంలో చేపల వేటకు వెళ్లిన పోలీసుకి ఓ చేప ముల్లు గుచ్చుకుంది. అతడు అనారోగ్యానికి గురికాగా.. ఒడ్డుకు వచ్చేశాడు. అతడికి వైద్యం అందించగా.. కోలుకోకుండానే మళ్లీ బోటులో చేపల వేటకు వెళ్లాడు. ఇంతలో పోలీసు ఆరోగ్యం మరింత క్షీణించింది. తనను ఒడ్డుకు తీసుకెళ్లాలని బోటులోని తోటి మత్స్యకారులను రెండు రోజులుగా వేడుకున్నా పట్టించుకోలేదని బాధిత కుటుంబం చెబుతోంది. దీంతో అతడు సముద్రంలో దూకాడు.. అతడిని కాపాడి ఈ నెల 12న ఒడ్డుకు తీసుకుని వచ్చారు.
అక్కడ పోలీసు తన తండ్రి ఒడిలో తలపెట్టుకుని పడుకున్నాడు.

చేప విషం తన ఒంటి నిండా పాకిందని.. ఆస్పత్రికి తీసుకెళ్లాలని, తానింక బతకనేమోనని తండ్రికి తన బాధను చెప్పుకున్నాడు. అలాగే తండ్రి ఒడిలోనే పడిపోయాడు.. తోటి మత్స్యకారులు దగ్గరలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయాడని డాక్టర్లు గుర్తించారు. విషయం తెలుసుకున్న భార్య రేవతి, తల్లి దుర్గమ్మ మంగుళూరుకు వెళ్లారు. ఆస్పత్రిలో విగతజీవిగా ఉన్న పోలీసుని చూసి కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతం అయ్యారు. పోలీసు మృతితో నర్సయ్యపేటలో విషాదచాయలు అలముకున్నాయి. ప్రభుత్వం పోలీసు కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానిక మత్స్యకారులు కోరారు.

తన కుమారుడి మరణనానికి తోటి మత్స్యకారులు, బోటు యజమాని కారణమని పోలీసు తండ్రి అవతారం అన్నారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన తన కొడుకుకు చేప ముల్లు గుచ్చుకుని ఆరోగ్యం క్షీణించిందన్నారు. ఒడ్డుకు తీసుకెళ్లాలని బోటు డ్రైవర్‌ను రెండు రోజులుగా బతిమాలినా పట్టించుకోలేదన్నారు. అందుకే పోలీసు సముద్రంలోకి దూకేశారని.. దీంతో కాపాడి ఒడ్డుకు తెచ్చారన్నారు. చనిపోయే ముందు ఈ విషయం తనకు చెప్పి బాధపడ్డారన్నారు.. తన కుమారుడి మరణానికి కారణమైనవారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తన కుమారుడి మరణంతో భార్య, ఇద్దరు పిల్లలు దిక్కులేనివాళ్లు అయ్యారని.. ప్రభుత్వం ఆదుకోవాలని అవతారం కోరుతున్నారు. వారి ఉపాధికి ఓ మార్గం చూపించాలన్నారు.

About amaravatinews

Check Also

ఇక విద్యార్థుల సెల్‌ఫోన్లకే పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు.. మంత్రి లోకేశ్‌ వెల్లడి

మనమిత్ర వాట్సప్‌ గవర్నెన్స్‌ 2.0 వెర్షన్‌ను మరిన్ని సేవలకు అనుసంధానిస్తున్నట్లు మంత్రి లోకేష్‌ శాసనసభలో తెలిపారు. ఈ ఏఐ ఆధారిత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *