కేంద్రం కీలక నిర్ణయం.. పీఎఫ్ విత్ డ్రా లిమిట్ పెంపు.. ఒకేసారి రూ.1 లక్ష తీసుకోవచ్చు!

PF Withdrawal: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సబ్‌స్క్రైబర్లకు అదిరే శుభవార్త అందించింది కేంద్రం. ఉద్యోగులు ఇకపై తమ వ్యక్తిగత ఆర్థిక అవసరాల కోసం లక్ష రూపాయల వరకు విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. ఈ మేరకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవియా మంగళవారం వివరాలు వెల్లడించినట్లు హిందుస్తాన్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది. ఇప్పటి వరకు పీఎఫ్ ఖాతా నుంచి ఒకసారి గరిష్ఠంగా రూ.50 వేలు మాత్రమే ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉండేది. ఇప్పుడు దానిని రూ.1 లక్షకు పెంచుతున్నట్లు కేంద్ర మంత్రి చెప్పారని తెలిపింది.

కేంద్ర కార్మిక శాఖ కొద్ది రోజులుగా ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) ఆపరేషన్స్‌లో పలు మార్పులు చేసింది. అందులో ప్రధానంగా కొత్త డిజిటల్ ఫ్రేమ్‌వర్క్, పీఎఫ్ ఖాతా నిర్వహణ సులభతరం చేయడం, ఫిర్యాదులపై త్వరగా స్పందించేందుకు గల మార్గదర్శకాల వంటివి ఉన్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. అలాగే కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు తమ ఉద్యోగ కాలం 6 నెలల గడవక ముందే పీఎఫ్ ఖాతా నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. అంతకు ముందు 6 నెలలు గడిచే వరకు డబ్బులు తీసుకునేందుకు అవకాశం లేదు. ఆ ఆంక్షల్లో మార్పులు చేసినట్లు తెలిపారు.

‘ పెళ్లిళ్లు, వైద్య చికిత్సల వంటి ఖర్చుల కోసం ప్రజలు ఎక్కువగా ఈపీఎఫ్ఓ పొదుపుపై ఆధారపడుతున్నారు. ఈ క్రమంలోనే పీఎఫ్ ఖాతా నుంచి సింగిల్ ట్రాన్సాక్షన్‌లో నగదు విత్ డ్రా పరిమితిని రూ.1 లక్షకు పెంచుతున్నాం.’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు ఏర్పడి 100 రోజుల పూర్తవుతున్న సందర్భంగా కార్మిక మంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ మేరకు కేంద్ర మంత్రి మాన్సుఖ్ మాండవియా వెల్లడించారు. ప్రజల వినియోగ ఖర్చులు భారీగా పెరిగిన క్రమంలో గతంలో ఉన్న లిమిట్‌ను పెంచి కొత్త విత్ డ్రా లిమిట్ నిర్ణయించినట్లు చెప్పారు.

ప్రావిడెంట్ ఫండ్ అనేది కోటి మందికి పైగా ఉద్యోగులకు రిటైర్మెంట్ ఆదాయం కల్పిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ఓ సేవింగ్స్ వడ్డీ రేటు 8.25 శాతంగా ఉంది. మధ్య తరగతి వేతన జీవులకు ఈ వడ్డీ రేటు చాలా కీలకంగా ఉంటుందని చెప్పవచ్చు. మరోవైపు.. ఈపీఎఫ్ఓలో సభ్యత్వం లేని ఆర్గనైజేషన్లు ప్రభుత్వ రిటైర్మెంట్ ఫండ్ మేనేజర్లతో చేరేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. పలు సంస్థలు సొంత ప్రైవేట్ రిటైర్మెంట్ స్కీమ్స్ అమలు చేస్తున్నాయి. 1954లో ఈపీఎఫ్ఓ ఏర్పాటు చేయక ముందు నుంచే ఉన్న ఫండ్స్ అలాగే కొనసాగుతున్నాయి. ఇప్పుడు అవి ఈపీఎఫ్ఓలే చేరేందుకు కేంద్రం అనుమతిస్తోంది. మొత్తంగా 17 కంపెనీలు ప్రైవేట్ రిటైర్మెంట్ స్కీమ్స్ రన్ చేస్తున్నాయి. వాటిల్లో రూ.1000 కోట్లకుపైగా నిధులు ఉన్నట్లు సమాచారం.

About amaravatinews

Check Also

యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ నోటిఫికేషన్‌ విడుదల.. ఈసారి ఎన్ని పోస్టులున్నాయంటే?

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (సీఎస్‌ఈ) 2025, ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ (ఐఎఫ్‌ఎస్‌) ఎగ్జామినేషన్‌ 2025.. ఈ రెండు నోటిఫికేషన్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *