మాజీ మంత్రి జోగి రమేష్‌కు షాక్.. మాజీ మంత్రి ఇంట్లో ఏసీబీ సోదాలు, చిక్కులు తప్పవా!

మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. ఇబ్రహీపంట్నలోని రమేష్ నివాసంలో 15మంది అధికారులు తనిఖీలు జరుపుతున్నారు. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఏసీబీ దర్యాప్తు చేస్తోంది.. ఈ క్రమంలోనే సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అగ్రిగోల్డ్ భూముల విషయంలో జోగి రమేష్‌పై ఆరోపణలు వచ్చాయి. అగ్రిగోల్డ్‌కు సంబంధించి సీఐడీ స్వాధీనంలో ఉన్న రూ.5కోట్ల విలువైన భూముల్ని కబ్జా చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఏసీబీ రంగంలోకి దిగి ఈ సోదాలు చేస్తున్నట్లు సమాచారం.

ఎన్టీఆర్‌ జిల్లా అంబాపురంలో అగ్రిగోల్డ్‌కు చెందిన భూమి ఉంది. ఆర్‌ఎస్‌ నం.69/2, రీసర్వే నం.87లో సుమారు 2,300 గజాల భూమి ప్లాట్ల రూపంలో ఉంది.. ఏపీ సీఐడీ ఈ భూమిని స్వాధీనం చేసుకుంది. జోగి రమేష్ కుటుంబం అగ్రి గోల్డ్‌ భూములు వివాదంలో ఉండటంతో.. రమేష్ బాబాయి జోగి వెంకటేశ్వరావు, జోగి తనయుడు జోగి రాజీవ్‌‌లు చెరో 1,086, 1,074 గజాలను తమ పేరుతో రాయించుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ భూమి విషయంలో ఎక్కడా సమస్య రాకుండా తగిన జాగ్రత్తలు కూడా తీసుకున్నారు.

అంబాపురంలో ఆర్‌ఎస్‌ నం.88లో పట్టాదారులుగా ఉన్న కనుమూరి వెంకటరామరాజు, వెంకట సుబ్బరాజులు తమకు సంబంధించిన నాలుగు ఎకరాల భూమిని బొమ్ము వెంకట చలమారెడ్డికి విక్రయించారు. ఆయన అందులో ఒక ఎకరా భూమిని పోలవరపు మురళీమోహన్‌కు అమ్మేయగా.. ఆయన మహాలక్ష్మీ ప్రాపర్టీస్‌ అండ్‌ ఇన్వెస్టెమెంట్స్‌కు చెందిన అడుసుమిల్లి మోహన రామదాసుకు 3,800 గజాలు విక్రయించారు. 2022లో ఈ మోహన రామదాసు నుంచి జోగి వెంటేశ్వరరావు, జోగి రాజీవ్‌లు 2,160 గజాలు కొనుగోలు చేసి వెంటనే 200 గజాలు ప్లాట్లుగా వేసి ఏడుగురు వ్యక్తులకు విక్రయించారు.

సర్వే నం.88లో కొనుగోలు చేసినట్లగా చూపించిన భూమి దస్తావేజుల్లో తప్పు ఉందని.. 2023లో సవరణ చేయించారు. అప్పుడు అగ్రి గోల్డ్‌ భూములున్న సర్వే నం.87ను అసలుదిగా ప్రస్తావించారు. అంటే సర్వే నం.87లోని భూమి కొనుగోలు అంతా నాటకమనే ఆరోపణలు వచ్చాయి. అగ్రి గోల్డ్‌ భూమి కోసం ఇదంతా చేసినట్లు విమర్శలు వచ్చాయి. వీరు కొనుగోలుదారులకు విక్రయించిన భూమి కూడా అగ్రి గోల్డ్‌కు చెందినది. సీఐడీ అటాచ్‌మెంట్‌లో ఉన్న భూమిని కొనుగోలు చేసి వారంతా మోసపోయారు. అలా జోగి కుటుంబం విక్రయించగా మిగిలిన 800గజాల్లో జోగి కుటుంబం ప్రహరీ నిర్మించే ప్రయత్నం చేశారు. ఇంతలో అగ్రి గోల్డ్‌కు చెందిన అవ్వా వెంకట శేషు నారాయణరావు విజయవాడ టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విజయవాడ రూరల్‌ తహశీల్దార్‌ నివేదికతో వివాదా స్పద అగ్రిగోల్డ్‌ భూముల్ని జోగి కుటుంబం విక్రయించినట్లు తేలింది. ఇప్పుడు ఈ వ్యవహారంలో ఏసీబీ రంగంలోకి దిగింది.

About amaravatinews

Check Also

తిరుమల రూపురేఖలు మారబోతున్నాయి.. త్వరలోనే, టీటీడీ ఈవో కీలక వ్యాఖ్యలు

తిరుమలను పక్కా ప్రణాళికతో కూడిన మోడల్‌ టౌన్‌గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు టీటీడీ ఈవో జే శ్యామలరావు. తిరుపతిలోని పరిపాలన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *