కాలుష్య నియంత్రణ మండలిలో కొందరు అధికారులు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలనే బేఖాతరు చేస్తున్నారు! వద్దన్న పని చేయడానికే సిద్ధమవుతున్నారు.. ప్రభుత్వం మారినా వారిలో వైసీపీ వాసన వీడడంలేదు!
- కాలుష్య నియంత్రణ మండలిని వీడని వైసీపీ వాసన
- బయో వేస్ట్ ప్లాంట్ల ఏర్పాటులో సీపీసీబీ మార్గదర్శకాలకు తూట్లు
- విజయనగరంలో వైసీపీ నేత కంపెనీకి అనుమతివ్వాలని నిర్ణయం
- అడ్డగోలు అనుమతికి డిప్యూటీ సీఎం నో
- అయినా ఫైలు నడుపుతున్న అధికారులు
- భారీగా ముడుపులు తీసుకోవడమే కారణం
- అప్పిలేట్ అథారిటీ ఆదేశాలు బేఖాతర్
- సీపీసీబీ వ ద్దన్నా, హైకోర్టులో కేసులున్నా డోంట్‌కేర్
- నిబంధనలకు విరుద్ధంగా 7 ప్లాంట్ల ఏర్పాటుకు స్కెచ్
- కూటమి సర్కారు వచ్చినా తీరు మార్చుకోని కొందరు
కాలుష్య నియంత్రణ మండలిలో కొందరు అధికారులు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలనే బేఖాతరు చేస్తున్నారు! వద్దన్న పని చేయడానికే సిద్ధమవుతున్నారు.. ప్రభుత్వం మారినా వారిలో వైసీపీ వాసన వీడడంలేదు! బయో వేస్ట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్స్ అనుమతుల విషయంలో ఇప్పటికీ అడ్డగోలుగానే వ్యవహరిస్తున్నారు. తాజాగా విజయనగరంలో జిల్లాలో వైసీపీ నేతకు చెందిన ఓ కంపెనీ ఏర్పాటుకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులివ్వడానికి సిద్ధమయ్యారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టికి వెళ్లడంతో అనుమతులివ్వకుండా కొద్దిరోజులుగా ఆపేశారు. ఆయనను ఏమార్చి ఇప్పుడు మళ్లీ సదరు ఫైల్‌ను అధికారులు మెల్లగా తెరపైకి తీసుకువస్తున్నారు. దీనంతటికీ కారణం వైసీపీ హయాం నుంచి పాతుకుపోయిన కొందరు అధికారులు ఇప్పటికే భారీ ఎత్తున ముడుపులు తీసుకోవడమేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది కాకుండా రాష్ట్రంలో మరో ఏడు కొత్త ప్లాంట్ల ఏర్పాటుకు భారీ స్కెచ్ వేశారు.
బయో వేస్ట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్స్ విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎక్కడపడితే అక్కడ.. ఎవరికి పడితే వారికి అనుమతులివ్వడానికి లేదు. ఇందుకు నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ తీర్పులతోపాటు, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించింది. ఆయా మార్గదర్శకాలను అనుసరించి సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తర్వాత ప్లాంట్స్‌కు అనుమతులు ఇవ్వాలి.
కానీ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులు వీటిని తుంగలో తొక్కి కొత్త ప్లాంట్స్‌కు అనుమతులిచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ మాజీ మంత్రి అండదండలతో విజయనగరం జిల్లాల్లో ఒక కొత్త ప్లాంట్‌ను ఏర్పాటు చేసేశారు. ఈ కంపెనీకి బయో వేస్ట్ కలెక్షన్ చేసుకునేందుకు అనుమతివ్వాలని పీసీబీ అధికారులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో పాటు పీసీబీ అధికారులకు భారీగా ముడుపులు ముట్టజెప్పారు. ప్రభుత్వం మారినా అధికారులు సదరు కంపెనీకి మేలు చేసే విధంగా బయో వేస్ట్ కలెక్షన్‌కు అనుమతులిచ్చేందుకు సిద్ధమవుతున్నారు.