బిగ్ బాస్ అంటే.. అదో సెలబ్రిటీ షో. ప్రపంచ వ్యాప్తంగా మంచి క్రెడిబిలిటీ ఉన్న రియాలిటీ షో అని అనేవారు ఒకప్పుడు. కానీ.. ఇప్పుడు బిగ్ బాస్ అంటే అదో గబ్బు షో. అక్కడికి వెళ్తే జీవితాలు బాగుపడటం కాదు.. ఉన్న జీవితాలు సర్వ నాశనం అవుతాయి. కొంతమంది ఫేక్ గాళ్లు ఈ షో వల్ల లాభపడి ఉండొచ్చేమో కానీ.. అత్యధిక శాతం మంది మాత్రం.. బిగ్ బాస్‌కి వెళ్లి తమ క్యారెక్టర్‌ని బజారున పెట్టుకున్న వాళ్లే కనిపిస్తుంటారు. ఒకటి మాత్రం నిజం.. బిగ్ బాస్‌కి వెళ్తే డబ్బులు వస్తాయి.. కాస్తో కూస్తో పాపులారిటీ కూడా వస్తుంది. కానీ ఇమేజ్ డ్యామేజ్ అంతకుమించే ఉంటుంది.
పైగా సోషల్ మీడియా పైత్యపు కాలంలో ఇలాంటి షోలో నెట్టుకుని రావడం అంటే.. మామూలు విషయం కాదు. గత సీజన్‌లో గెలవడం కోసం ఎలాంటి వికృత చర్యలకు పాల్పడ్డారో చూశాం. పల్లవి ప్రశాంత్ గెలిచిన తరువాత.. తనకి పోటీగా ఉన్న అమర్ దీప్‌ని అతని తల్లిని, భార్యని పచ్చి బూతులు తిడుతూ ఏవిధంగా తరిమితరిమి కొట్టారో కళ్లారా చూశాం. అలాంటిది ఓ అమ్మాయి.. అందులోనూ చిన్నవయసులో భర్తని కోల్పోయి.. ప్రత్యక్షంగానో పరోక్షంగానో తన తండ్రి చావుకి కూడా కారణమైన అమృత ప్రణయ్ లాంటి అభాగ్యురాలు బిగ్ బాస్ హౌస్‌కి వస్తుందంటే కాకుల్లా పొడవడానికి కత్తికట్టి కాసుకుని కూర్చుంటారు సైకో బ్యాచ్‌లు. అందుకే చితికి బతికిన అమృత బాగుండాలని కోరుకునే వాళ్లు ‘అమ్మా అమృతా వెళ్లొద్దమ్మా బిగ్ బాస్‌కి.. చితికిన బతుకుని అంగట్లో అమ్మేస్తారు’ అంటూ ముందే హెచ్చరిస్తున్నారు.